స్పష్టమైన ప్రకటన చేసిన మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
ఎమ్మెల్యే పరిటాల సునీత, శ్రీరామ్ తో కలిసి మైనింగ్ ప్రాంతం పరిశీలన
విశాలాంధ్ర ధర్మవరం;;రాష్ట్రంలో జొన్నగిరికి మించిన మరో గోల్డ్ మైన్ అందుబాటులోకి రానుందని మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మూత పడ్డ భరత్ గోల్డ్ మైన్ యూనిట్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఇతర జిల్లా టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బంగారం గనులున్న ప్రాంతాన్ని మొత్తం వారు పరిశీలించారు. అలాగే గతంలో అక్కడ పని చేసిన కార్మికులు, స్థానికులతో మంత్రి, ఎమ్మెల్యే సునీత మాట్లాడారు. అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర గార్ల విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై మినిట్స్ పుస్తకంలో సంతకాలు చేశారు. బంగారు గనుల్లో పనిచేసిన వారితో అర్జీలు స్వీకరించారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బంగారం మైనింగ్ చేస్తున్న సమయంలో ఎంతో మందికి ఉపాధి ఉండేదన్నారు. పరిటాల రవీంద్ర కార్మిక సంఘం నాయకునిగా కూడా పని చేశారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మైనింగ్ మూసివేసినప్పటి నుంచి వారికి ఉపాధి కరవైందన్నారు. అంతే కాకుండా విలువైన ఖనిజాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడి నుంచి తరలించారన్నారు. అప్పుడు కేసులు పెట్టేందుకు వెళ్లినా కూడా పోలీసులు స్పందించలేదన్నారు. సుమారు వెయ్యి టిప్పర్ల ఖనిజాన్ని ఇక్కడ నుంచి వైసీపీ నాయకులు తరలించుకుపోయారన్నారు. అంతే కాకుండా మైనింగ్ మళ్లీ మొదలుపెడుతామని చెప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేయగా.. మైనింగ్ ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్కువగా బంగారం దొరుకుతుందన్నారు. ఇక్కడ మైనింగ్ తిరిగి ప్రారంభిస్తే వందలాది కుటుంబాలకు మేలు జరుగుతుందని.. ఎంతో మంది ఉపాధి లభిస్తుందన్నారు. మా ప్రాంత ప్రజల కల త్వరలోనే సాకారం అవుతుందని వారి తెలిపారు.మంత్రి కొల్లు రీవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉన్నప్పటికీ.. గత పాలకులు మైనింగ్ వ్యవస్థ ను నిర్వీర్యం చేశారని.. కొన్ని చోట్ల దోపిడీకు పాల్పడ్డారన్నారు. ఉన్న మైనింగ్ లను సరిగా నిర్వహించకపోవడం, ఖనిజాన్ని దోపిడీ చేయడం వంటివి చేశారన్నారు. కొత్త వాటి గురించి అసలు ఆలోచించలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక.. మైనింగ్ గ్రోత్ 36శాతం పెరిగిందన్నారు. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో మైనింగ్ ప్రాంభించామన్నారు. అక్కడ రోజుకు ఒక కిలో బంగారం తీస్తున్నారన్నారు. అలాగే ఇప్పుడు రామగిరి ప్రాంతంలో కూడా బంగారం గనులను మళ్లీ తెరిపిస్తామన్నారు. ఇప్పటికే జీఎస్ఐ వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. కేంద్రం కూడా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 416 ఎకరాల్లో 108 హెక్టార్ల లో మైన్ ఉందన్నారు. జొన్నగిరిలో టన్నుకు ఒక గ్రాము బంగారం వస్తే.. రామగిరిలో టన్నుకు 4గ్రాముల బంగారం లభిస్తుందన్నారు. త్వరలోనే యాక్షన్ పిలుస్తామన్నారు. బ్రిటీష్ కాలం నుంచి 2002వరకు ఇక్కడ మైనింగ్ జరిగింది.. భారత్ మైన్స్ వారు 2001లో ఆపేశారన్నారు. ఇటీవల 2023లో మిషనరీతో పాటు ఇక్కడున్న ఖనిజాన్ని తీసుకెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇక్కడ మొత్తం 4లక్షల 60వేల టన్నుల ఖనిజం ఉండాలని అందులో లక్ష టన్నుల వరకు చోరీ అయినట్టు తెలుస్తోందన్నారు. దీనిపై కచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుందని.. అది ఎవరు చేసినా చర్యలు మాత్రం తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఖనిజాన్వేషణ వేగంగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.


