ఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రం లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదంటూ వచ్చిన వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో అసలు రిట్ పిటిషనే దాఖలు కాలేదని స్పష్టం చేశారు. కేవలం ఒక న్యాయవాది పంపిన ప్రాతినిధ్య లేఖ మాత్రమే అందిందని వెల్లడించారు. అలాంటి లేఖను రిట్ పిటిషన్‌గా పరిగణించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.శుక్రవారం కోర్టులో విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘గత రెండు రోజులుగా నేను కేసును లిస్టింగ్‌కు నిరాకరించానంటూ పూర్తిగా తప్పుడు ప్రచారం జరిగింది. ఉదయం 10 గంటల వరకు కూడా ఈ అంశంపై ఒక్క పేజీ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు కాలేదు. కేవలం ఒక లేఖ మాత్రమే వచ్చింది. దాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తాం? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద స్వయంగా ధ్రువీకరించుకున్నానని తెలిపారు.ఇటీవల అడ్వకేట్ నరేంద్ర మిశ్రా, విద్యార్థులపై పోలీసుల బలప్రయోగంపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరుతూ సీజేఐకి లేఖ పంపారు. దాన్ని అత్యవసరంగా ప్రస్తావించిన సమయంలో సీజేఐ ధర్మాసనం ‘‘మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయొద్దు‘‘ అని వ్యాఖ్యానించింది. అలాగే వీడియోలు చూపిస్తానని న్యాయవాది చెప్పగా ‘‘మాకు వీడియోలు చూడడానికి సమయం లేదు ‘‘ అని ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి.


