నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజూ తీవ్ర ప్రతిష్ఠంభనకు దారితీసింది.
ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు.రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.నీట్ పేపర్ లీక్‌పై చర్చ జరగాలంటే ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.మంత్రి రాజీనామా చేసిన తర్వాతే ఈ అంశంపై సభలో చర్చకు సిద్ధమని వెల్లడించాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ సభలో నినాదాలు
సభ కార్యకలాపాలకు ప్రతిపక్ష సభ్యులు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారని లోక్‌సభ చైర్మన్ జగదంబిక పాల్ విమర్శించారు.నీట్ అంశంపై చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని తెలిపారు.అయితే స్పీకర్ అనుమతి, బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఆమోదం, అనంతరం సభ అజెండాలో అంశాన్ని చేర్చిన తర్వాతే చర్చ చేపడతామని ఆయన వివరించారు.అయితే ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్‌ను కొనసాగిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ సభలో నినాదాలు చేశారు.దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు సంబంధించి ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ చర్చను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.మరోవైపు, ఇదే వివాదం కారణంగా రాజ్యసభ సమావేశాలు కూడా సజావుగా సాగలేదు.సభలో కొనసాగిన ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.


