Homeజాతీయంఅసోంను ముంచెత్తిన వరదలు.. 80కి చేరిన మృతుల సంఖ్య

అసోంను ముంచెత్తిన వరదలు.. 80కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,ఉద్ధృతంగా ప్రవహిస్తున్ననదులతో రాష్ట్రం తీవ్ర వరదల బారిన పడింది.రోజురోజుకూ పరిస్థితులు మరింత విషమిస్తుండగా,గురువారం మరో ఇద్దరు మృతిచెందడంతో ఈ ఏడాది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 80కి చేరిందని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎస్‌డీఎంఏ) వెల్లడించింది.ప్రస్తుతం చరాయిదేవ్,గోలాఘాట్,జోర్‌హాట్,శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది.
ఈ నాలుగు జిల్లాల్లోనే సుమారు 2.12 లక్షల మంది ప్రజలు ఇంకా వరద నీటిలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.బుధవారం వరకు మూడు లక్షల మందికి పైగా వరద ప్రభావానికి గురైనప్పటికీ,గురువారం కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం స్వల్పంగా తగ్గడంతో బాధితుల సంఖ్య కొంత మేర తగ్గింది.

సహాయక చర్యలు ముమ్మరం
అయినప్పటికీ అనేక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఇంకా నెలకొనలేదు.చరాయిదేవ్ జిల్లానే అత్యధికంగా ప్రభావితమైంది. అక్కడ సుమారు 80వేల మంది వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, శివసాగర్ జిల్లాలో 71వేల మంది,జోర్‌హాట్ జిల్లాలో దాదాపు 40 వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 112 సహాయక శిబిరాలు,నిత్యావసర వస్తువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.ప్రస్తుతం 75,583 మందికి ఈ శిబిరాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. భారత సైన్యం,జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్),రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్),అగ్నిమాపక శాఖ, పోలీసులు, స్థానిక అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి అప్పర్ అసోంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బాధితులకు ఆహార కొరత తలెత్తకుండా గత 24 గంటల్లోనే 918.55 క్వింటాళ్ల బియ్యం, 203.9 క్వింటాళ్ల పప్పు, 146.7 క్వింటాళ్ల ఉప్పుతో పాటు 17,546.4 లీటర్ల నువ్వుల నూనె పంపిణీ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 437 గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దాదాపు 17,198 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతింది.వరదల ప్రభావంతో కాజ్‌వేలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.నుమాలిగఢ్ ప్రాంతంలోని ధన్సిరి నది ఇంకా ప్రమాద హెచ్చరిక స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.వరదల ప్రభావం మనుషులకే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,97,384 పెంపుడు జంతువులు, పక్షులు కూడా ఈ విపత్తుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.

బాధితులకు సల్మాన్ ఖాన్ సాయం
అసోం వరద బాధితులకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు.తన స్వచ్ఛంద సంస్థ ఃబీయింగ్ హ్యూమన్ః ద్వారా స్థానిక అభిమాన సంఘాల సహకారంతో దశలవారీగా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మొదటి విడతలోనే వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణం వినియోగించుకునే ఆహార ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ ప్రారంభించారు.త్వరలో రేషన్ కిట్లు, మందులు, సురక్షిత తాగునీరు, శానిటరీ ప్యాడ్లు, దోమల నివారణ స్ప్రేలను కూడా పంపిణీ చేయనున్నారు.అదేవిధంగా వరదలతో దెబ్బతిన్న పాఠశాలలు, ఆసుపత్రుల పునర్నిర్మాణానికి కూడా సహకారం అందించనున్నట్లు సమాచారం.ఎలాంటి ప్రచారం లేకుండా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు రావడంపై సల్మాన్ ఖాన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్పందించిన ఆలియా భట్, భూమి పెడ్నేకర్
అసోం వరదలపై నటి ఆలియా భట్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, అసోం పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు.ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు.సర్వస్వం కోల్పోయిన బాధితులకు వెంటనే సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పిలుపునిచ్చారు.ప్రతి ఏడాది వరదలు సంభవిస్తున్నప్పటికీ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.నటి భూమి పెడ్నేకర్ కూడా అసోం వరదలపై వరుసగా వీడియోలు పంచుకుంటూ, బాధితులకు విరాళాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు