ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ ఆధారిత మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్త పరిణామాలకు దారితీసింది.ఈ వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలువురు సోషల్ మీడియా వినియోగదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన ఈ వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయా అనే కోణంలో అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)తో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
మెటా భద్రతా వ్యవస్థలపైనా విచారణ
వైరల్ అయిన వీడియోలు ఎక్కడ రూపొందించబడ్డాయి, వాటిని మొదటగా ఎవరు అప్లోడ్ చేశారు, ఏ విధంగా సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందాయనే విషయాలపై డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు.అలాగే ఇటువంటి మార్ఫింగ్, తప్పుడు కంటెంట్‌ను అడ్డుకునేందుకు మెటా అమలు చేస్తున్న భద్రతా, కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలు ఎంతవరకు సమర్థంగా పనిచేశాయనే అంశాన్ని కూడా విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ఏఐ ఆధారిత మోసాలు,నకిలీ ప్రకటనలు,మార్ఫింగ్ వీడియోలు వంటి తప్పుడు కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు మెటా అనుసరిస్తున్న విధానాలపై వివరణ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంస్థ ప్రతినిధులను విచారణకు పిలిచారు.విచారణకు హాజరైన కంపెనీ ప్రతినిధి కంటెంట్ మోడరేషన్,భద్రతా చర్యలకు సంబంధించిన వివరాలను అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.
జంతర్‌మంతర్‌లో మోదీపై వ్యాఖ్యల నేపథ్యంలో మరో కేసు
ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే కొనసాగుతోందని, లభ్యమవుతున్న డిజిటల్ ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా, ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపైనా పోలీసులు చర్యలు చేపట్టారు.ఈ కేసులో నోయిడాకు చెందిన రుచికా సింగ్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


