తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేశారు. చెన్నైలో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణకు వచ్చేలోపే ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. కావేరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉదయనిధి నిన్న ప్రసంగించారు. ఆ సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి నటి త్రిష పేరు ప్రస్తావించగా, దానికి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంతో ఉన్నాయని విమర్శలు వచ్చాయి. మహిళలను అవమానించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. అధికార టీవీకే పార్టీ నేత ఆధవ్ అర్జున్ ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. రాజకీయాల స్థాయిని దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ కూడా స్పందించారు. అదే వ్యాఖ్యలను తన కుటుంబ సభ్యుల ముందు చెబుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. ఉదయనిధిని వెంటనే అరెస్టు చేయాలని తమిళనాడు బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై కూడా విమర్శలు గుప్పించారు. నటి త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదాన్ని డీఎంకే కొట్టిపారేసింది. కావేరి జలాల సమస్య, డెల్టా రైతుల ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారని మాజీ మంత్రి టీ. మనో తంగరాజ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఉదయనిధి ప్రశ్నించకుండా అడ్డుకునేందుకే ఈ ప్రచారం జరుగుతోందని అన్నారు.
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల దుమారం.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- Advertisement -
RELATED ARTICLES


