విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : 2025 డీఎస్సీ నోటిఫికేషన్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉరవకొండలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2025 డీఎస్సీ నోటిఫికేషన్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీని కారణంగా అర్హత ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఒక్కో పోస్టును రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


