దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగాయి.
వాహనదారులపై ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) మరోసారి అదనపు భారం మోపింది. సీఎన్‌జీ ధరను కిలోకు రూ.3.89 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.86.98కి చేరింది.
నోయిడా, ఘజియాబాద్‌లో కిలో ధర రూ.95.59గా, గురుగ్రామ్‌లో రూ.92.01గా కొత్త ధరలు ఖరారయ్యాయి. మీరట్, ముజఫర్‌నగర్, షామ్లీ తదితర ప్రాంతాల్లోనూ పెరిగిన ధరలే అమల్లోకి వచ్చాయి.
సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది ఐదోసారి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ధరలు గణనీయంగా పెరగడమే సీఎన్‌జీ ధరల పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.సీఎన్‌జీ ఉత్పత్తికి అవసరమైన సహజ వాయువును ప్రధానంగా ఎల్‌ఎన్‌జీ రూపంలోనే దిగుమతి చేసుకుంటున్నారు.హార్ముజ్ జలసంధి మీదుగా జరిగే ఇంధన రవాణాలో ఆటంకాలు ఏర్పడటం, శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఐరోపా దేశాలు తమ గ్యాస్ నిల్వలను పెంచుకోవడం వంటి పరిణామాలతో సరఫరా వ్యయం పెరిగింది.పశ్చిమాసియా సంక్షోభం మొదలైన తర్వాత మే 15 నుంచి ఇప్పటివరకు సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది ఐదోసారి.ఈ ధరల పెంపు ప్రభావం ప్రైవేట్ కార్లు, ట్యాక్సీలు, ఆటోరిక్షాలతో పాటు వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులపైనా పడనుంది.


