తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతోంది. వచ్చే నెల తొలి వారంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల కోసం శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు.
ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసి సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఈ ప్రశ్నలను సెప్టెంబరు 2లోపు శాసనసభకు అందించాలని పేర్కొన్నారు. రూల్-39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో సంబంధిత మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
సమాధానాలను సిద్ధం చేసుకోవాలి
ఎమ్మెల్యేలు ముందుగానే సమర్పించే ప్రశ్నలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించి.. వాటికి సమాధానాలను సిద్ధం చేయనున్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఎమ్మెల్యేలకు ఈ మేరకు లేఖ రాశారు. దీంతో త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల కోసం ప్రభుత్వం, శాసనసభ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.


