మీ వాహనం చోరీకి గురైందా? అయితే అది ప్రస్తుతం ఎక్కడుందో పోలీసుల కెమెరాలే గుర్తించే రోజులు రాబోతున్నాయి. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరిగాయని అనుకుందాం. ఆ తర్వాతి రోజు నుంచే గస్తీ బృందాలు ఆ ప్రాంతంలో నిఘా పెంచుతాయి. అలాగే నల్గొండ పట్టణంలో ఓ హత్య జరిగితే.. గతంలో అదే తరహాలో ఎక్కడెక్కడ హత్యలు జరిగాయో కంప్యూటర్ క్షణాల్లో విశ్లేషించగలదు.ఈ పరిష్కారాలకు మానవ ప్రమేయం ఉండదు. ఆయా వివరాలను విశ్లేషించి పరిష్కార మార్గాలను చూపించేది కృత్రిమ మేధ (ఏఐ). శాంతిభద్రతలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసు శాఖ.. పోలీసుల దైనందిన విధుల్లో కృత్రిమ మేధను వినియోగించేందుకు సిద్ధమవుతోంది.
ఆ కెమెరాలకు మెదడు ఉంటుంది..
చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైందని అనుకుందాం. ప్రస్తుతం ఆ వాహనం ఎక్కడుందో గుర్తించాలంటే కొన్ని గంటల పాటు వందలాది సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు ఏఐ సాంకేతికతను జోడిస్తే పరిస్థితి మారిపోతుంది. కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాలన్నీ డేటాబేస్‌లో రికార్డవుతాయి.చోరీకి గురైన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయగానే.. ఆ వాహనం ఏయే కెమెరాల్లో నమోదైందో, అక్కడి నుంచి ఏ దిశగా వెళ్లిందో క్షణాల్లోనే కంప్యూటర్ విశ్లేషిస్తుంది.రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తించడంలోనూ ఇదే సాంకేతికత ఉపయోగపడనుంది.
గస్తీ ఎక్కడో ఏఐ చెబుతుంది..
నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తుంటారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సెక్టార్ల వారీగా కొన్ని బీట్ పాయింట్లను నిర్ణయించుకుని ఆయా ప్రాంతాల్లో సిబ్బంది గస్తీ నిర్వహిస్తారు.దశాబ్దాలుగా ఇదే విధానాన్ని పోలీసులు అనుసరిస్తున్నారు. ఇకపై ఎక్కడెక్కడ గస్తీ నిర్వహించాలో ఏఐ సూచించనుంది.ఏదైనా పోలీస్‌స్టేషన్, జిల్లా లేదా కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాల వివరాల ఆధారంగా ఏఐ హీట్ మ్యాప్‌ను రూపొందిస్తుంది.గతంలో ఏయే ప్రాంతాల్లో నేరాలు జరిగాయో విశ్లేషించి.. ఏ ప్రాంతాల్లో గస్తీని పెంచాలో సూచిస్తుంది.అంతేకాదు.. మరుసటి రోజు సూచించిన ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది గస్తీకి వెళ్లారా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించి నివేదిక సమర్పిస్తుంది.
నేరం ఎలా జరిగిందో చెబితే.. నేరస్థుడు ఎవరో వెల్లడిస్తుంది
హత్య, దోపిడీ, దొంగతనం.. నేరం ఏదైనా నిందితుడిని ఎంత త్వరగా పట్టుకున్నారనే దానిపైనే పోలీసుల సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.సాధారణంగా నేరాల మధ్య ఉన్న సారూప్యతను బట్టి పోలీసులు వాటికి పాల్పడిన వ్యక్తులు ఎవరై ఉండొచ్చనే అంచనాకు వస్తుంటారు.ఇందుకోసం దర్యాప్తు అధికారులు వ్యక్తిగతంగా వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఖమ్మంలో జరిగిన తరహాలోనే హైదరాబాద్‌లోనూ ఓ నేరం జరిగిందనుకుందాం.ఈరెండు ఘటనల మధ్య ఉన్న పోలికలు ఆయా యూనిట్ల పోలీసులు పరస్పరం మాట్లాడుకుంటే తప్ప వెంటనే తెలిసే అవకాశం ఉండదు.ఏఐ వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారనుంది.నేరం ఎలా జరిగిందనే వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయగానే..రాష్ట్రంలో గతంలో అదే తరహాలో జరిగిన నేరాలను కంప్యూటర్ క్షణాల్లో విశ్లేషిస్తుంది.
కియోస్క్‌లోనే ధ్రువీకరణ పత్రాల ప్రింట్
పోలీసుల నుంచి దైనందిన అవసరాల కోసం ప్రజలు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది.ఉదాహరణకు ఉద్యోగం లేదా ఇంటర్న్‌షిప్ పొందాలంటే పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రం (క్లియరెన్స్ సర్టిఫికేట్) అవసరమవుతుంది.అదేవిధంగా వాహనం విక్రయించే సమయంలో, ఆస్తి లేదా ఇతర విలువైన పత్రాలు పోయినప్పుడు సంబంధిత సర్టిఫికేట్ పొందేందుకు కూడా పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటుంది.ఇకపై ఇలాంటి అవసరాల కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కియోస్క్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎలాంటి అభ్యంతరం లేదని నిర్ధారణ అయితే.. దరఖాస్తుదారు ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
ధ్రువీకరణ పత్రాన్ని ప్రింట్ తీసుకొనే అవకాశం
ఆ మెసేజ్ ఆధారంగా కియోస్క్ నుంచే సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని ప్రింట్ తీసుకోవచ్చు.ఇవే కాకుండా ఫిర్యాదుల స్వీకరణ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే మిస్సింగ్ కేసుల గుట్టువిప్పడం, గుర్తుతెలియని మృతదేహాల ఆచూకీ తెలుసుకోవడం వరకు పలు అంశాల్లో ఏఐ భాగం కానుంది.కృత్రిమ మేధను వినియోగించడం వల్ల పోలీసుల సామర్థ్యం మెరుగుపడటంతో పాటు సేవల్లో వేగం పెరగనుంది.ఇప్పటికే ఏఐ వినియోగంపై తెలంగాణ పోలీసు అధికారులు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు.త్వరలోనే ప్రయోగాత్మకంగా కొన్ని పోలీస్‌స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


