Homeఆంధ్రప్రదేశ్హైదరాబాద్‌లో దూరప్రాంత బస్సులకు నో ఎంట్రీ.. శివార్లలో 4 భారీ టెర్మినళ్లు

హైదరాబాద్‌లో దూరప్రాంత బస్సులకు నో ఎంట్రీ.. శివార్లలో 4 భారీ టెర్మినళ్లు

- Advertisement -

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా దూరప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే బస్సులను శివార్లలోనే నిలిపివేసేలా నాలుగు దిక్కులా భారీ బస్ టెర్మినళ్లను నిర్మించనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ విధానం అమల్లోకి వస్తే నగర ప్రజా రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినళ్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నిబంధనల పరిధిలోకి ప్రభుత్వ బస్సులతోపాటు ప్రైవేట్‌ బస్సులు కూడా..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతోపాటు ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సర్వీసులు ఇకపై నగరంలోకి ప్రవేశించకుండా ఈ టెర్మినళ్ల వద్దే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా పటిష్ఠమైన చివరి దశ రవాణా సదుపాయాలను (లాస్ట్‌-మైల్‌ కనెక్టివిటీ) అందుబాటులోకి తీసుకురానున్నారు. టెర్మినళ్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు ఇబ్బంది లేకుండా చేరుకునేందుకు టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలను అనుసంధానించనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ బస్సులతోపాటు ప్రైవేట్‌ బస్సులను కూడా ఈ నిబంధనల పరిధిలోకి తీసుకురానున్నారు. అవి కూడా నిర్దేశించిన టెర్మినళ్ల నుంచే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

రవాణా వ్యవస్థ బలోపేతానికి 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
టెర్మినళ్లను వినియోగించుకునే ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్ల నుంచి రుసుము వసూలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త టెర్మినళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాజులరామారంలో 100 ఎకరాలు, శంషాబాద్‌ సమీపంలో 150 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు 2,200 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి చెప్పారు. టెర్మినల్‌ ఆధారిత రవాణా వ్యవస్థ అమల్లోకి వస్తే నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు