విశాలాంధ్ర-రాప్తాడు : ఈనెల 22వ తేదీన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాప్తాడు పర్యటనకు రానున్న నేపథ్యంలో మండల కేంద్రంలో వేగవంత చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాప్తాడులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్, పరిటాల రవి కాంస్య విగ్రహాలను మంత్రి ఆవిష్కరిస్తారన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఏర్పాటు చిరకాల కల అని, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. లోకేష్ రాకతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకుడు ఎల్.నారాయణచౌదరి, మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తదితరులు పాల్గొన్నారు.


