విశాలాంధ్ర, ఉరవకొండ: ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సారిక ఆధ్వర్యంలో సోమవారం పెద్దకౌకుంట్ల, చిన్నకౌకుంట్ల, వైరాంపురం గ్రామాల్లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి ఇళ్ల వద్దే రక్త నమూనాలు సేకరించి పీహెచ్‌సీ ల్యాబ్‌కు పంపించారు. మలేరియా సబ్‌యూనిట్ అధికారి బత్తుల కోదండరాంరెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యు.వెంకటరమణ గ్రామాల్లో పర్యటించి దోమల నివారణపై అవగాహన కల్పించారు. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రమ్ములు, తొట్టెలు, బిందెలను వారానికొకసారి శుభ్రం చేసి ఎండబెట్టాలని తెలిపారు. పాత టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, వాడని రోళ్లు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వివరించారు. వైరాంపురంలో పెద్దఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించి మహిళలకు వ్యాధుల నివారణ చర్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ యుగంధర్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, హెల్త్ అసిస్టెంట్ ప్రసాదరావు, ఏఎన్‌ఎం రాధిక, ఎంఎల్‌హెచ్‌పీ దివ్యభారతి, ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటా ఫీవర్ సర్వే
- Advertisement -
RELATED ARTICLES


