విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ మండలంలో విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంఈఓ ఈశ్వరప్పను వెంటనే సస్పెండ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై గత కొద్ది రోజులుగా అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదని ఆరోపించారు. మండలంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ, కనీస వసతులు కల్పించడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో నిరాహార దీక్షలు, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం. హిరణ్య, ఎంవీఎస్ నాగరాజ్, గణేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.


