Homeఆంధ్రప్రదేశ్ఉచ్చు బిగిస్తున్న ఈడీ.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం

ఉచ్చు బిగిస్తున్న ఈడీ.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం

- Advertisement -

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ), కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 14న హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. 2025 ఆగస్టులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. హత్య కోసం కుట్రదారులు సమకూర్చాలనుకున్న రూ.40 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనుకున్నారు? అంత పెద్ద మొత్తాన్ని వారికి ఎవరు అందించారు? అనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది. అలాగే, హత్యలో పాల్గొన్న నిందితులకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.4 కోట్ల నగదు మూలాలపై కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. 2019 నుంచి నిందితులు, అనుమానితుల బ్యాంకు లావాదేవీలు, నిధుల కదలికలపై నిశితంగా పరిశీలిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే పలువురిని విచారించింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరితో పాటు ఇతర నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను ప్రశ్నించి వారి నుంచి కీలక వివరాలు సేకరించింది. దీనికి కొనసాగింపుగా గతంలో ఆగస్టు 21న హైదరాబాద్, కడప జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు రెండు లాకర్ల తాళాలు, కొన్ని కీలకమైన దస్త్రాలను కూడా అప్పట్లో సేకరించారు. గత సోదాల్లో లభించిన ఆధారాలు, ఇతర నిందితుల విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగానే తాజాగా అవినాష్ రెడ్డిని ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు మార్గాలపై అవినాష్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఈ పరిణామంతో వివేకా హత్య కేసులో దర్యాప్తు మరోసారి కీలక దశకు చేరుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు