విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కౌతాళం మండలం జెడ్పీటీసీ సభ్యుడు చూడి ఉలిగయ్యకు కేటాయించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పెద్దకడబూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ బలోపేతానికి నమ్మకస్తుడిగా పనిచేస్తున్న చూడి ఉలిగయ్యకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత, అంకితభావం, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసే నాయకత్వ లక్షణాలను గుర్తించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కేటాయించాలని కోరారు. పదవిని ఉలిగయ్యకు అందించడం ద్వారా వాల్మీకి సామాజిక వర్గానికి సముచిత గౌరవం, రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి, పార్టీ కోసం కష్టపడిన నాయకులకు గుర్తింపు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందుండాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించి ఉలిగయ్యకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


