స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కేశవ్
విశాలాంధ్ర – ఉరవకొండ(అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తూ ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన కార్యక్రమాలు కన్నుల పండువగా, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈఓ, అర్చకులు వేదమంత్రాల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పల్లకి సేవలో మంత్రి పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన మడుగుతేరు (రథోత్సవం) ఆశేష భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. నిగోవిందా… గోవిందా…” నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నలుమూలలతో పాటు సమీప ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఉత్సవాలను తిలకించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేసి తాగునీరు, అన్నప్రసాదం, భద్రత వంటి సదుపాయాలు కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెన్నహోబిళం క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


