వారి సేవలు ఒక్క రోజు ఆగినా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్
ఆర్టీసీ ఉద్యోగులకిచ్చిన అన్ని హామీలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం అంటే చాలా సులభంగా ఉంటుందనే భావన చాలా మందిలో ఉందని.. కానీ ఆర్టీసీలో ఉద్యోగం మాత్రం చాలా శ్రమతో కూడుకున్నదని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం ఆర్టీసీ డిపోలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధర్మవరం డిపోలో సుదీర్ఘకాలం పాటు పని చేసి పదవీ విరమణ పొందిన ఈశ్వరయ్య, ప్రభాకర్ రెడ్డికి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇద్దరు ఉద్యోగుల్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని.. అయితే ఇన్ని రోజులు వారు ఎలాంటి సేవలందించారన్నది చాలా రోజుల పాటు గుర్తుంటుందన్నారు. ముఖ్యంగా ఆర్టీసీలో సుదీర్ఘకాలం పాటు చేయడం చాలా శ్రమతో కూడుకున్నదన్నారు. డ్రైవర్లు, కండెక్టర్లు, డిపోలో పని చేసే సిబ్బంది శారీరక శ్రమ అంతా ఇంతా కాదన్నారు. వీరంతా ప్రతి రోజు పని చేస్తేనే ఎన్నో వేల మంది తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతారన్నారు. అదే వీరు ఒక్క రోజు పని చేయకపోయినా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందన్నారు. ఇన్ని రోజులు పాటు చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి కుటుంబ సభ్యులతో సంతోషంగా వారు గడపాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని శ్రీరామ్ స్పష్టం చేశారు.