-ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నిరుపేదలు, కూలీల ఆకలి తీర్చే సంక్షేమ ప్రదాయిని ‘అన్న క్యాంటీన్’ అని ఎమ్మెల్యే పరిటాల సునీత, హిందూపురం ఎంపీ పార్థసారథి అన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో బుధవారం అన్నా క్యాంటీన్, పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్ ను మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఎంపీలు ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్‌ను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం వారు భోజనాన్ని రుచి చూసి, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందనే అసూయతో జగన్ ఈ పథకాన్ని ఆపేశారని, దీనివల్ల వేలాది మంది పేదలు ఆకలితో అలమటించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రూ. 61 లక్షల వ్యయంతో ఈ సుందరమైన క్యాంటీన్‌ను నిర్మించామని చెప్పారు. దీనివల్ల మండల కేంద్రంలోని కార్యాలయాలకు, ఆసుపత్రులకు వచ్చే వారితో పాటు ఆటో నగర్ కార్మికులకు, కూలీలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. హరే కృష్ణ మిషన్ (అక్షయపాత్ర) సహకారంతో కేవలం రూ.5 రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనాన్ని మూడు పూటలా అందిస్తున్నామని, దాతలు కూడా ముందుకు వచ్చి విరాళాల ద్వారా అన్నదానంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను
ప్రారంభిస్తే, వేలాది మంది పేదలకు అండగా ఉన్న వాటిని మాజీ సీఎం జగన్ తన కక్షపూరిత రాజకీయాలతో మూసివేసి పేదవాడి నోటి కాడ కూడు లాగేసుకున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రభుత్వం మారినా సీఎం స్టాలిన్ ‘అమ్మ క్యాంటీన్ల’ను కొనసాగించారని, జగన్ కనీసం ఆయన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాల్సిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 265 క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల పక్షపాతిగా నిలిచిందని కొనియాడారు. ఇదే క్రమంలో రూ. 10 లక్షలతో నిర్మించిన పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్కును కూడా వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి సి ఎం ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీన, సొసైటీ చైర్మన్లు మరూరు గోపాల్, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహశీల్దార్ విజయకుమారి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సుబ్బరాయుడు, డీఈ జ్యోతి, ఆయా మండలాలు కన్వీనర్లు ప్రధాన కార్యదర్శులు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


