Homeగోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు

గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు

- Advertisement -

. హర్యానాకు ఆషిమ్‌కుమార్‌, లద్దాఖ్‌కు కవీందర్‌ గుప్తా
. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
. ఏపీకి గర్వకారణమన్న సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు పూసపాటి అశోక్‌గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. దేశంలోని మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నరుగా అశోక్‌ గజపతిరాజు, హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్‌ ఆషిమ్‌కుమార్‌ ఘోష్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు హర్యానా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మరో తెలుగు రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజుకు అవకాశం కల్పించారు.
ఏపీకి గర్వకారణం: చంద్రబాబు
గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్‌ గజపతిరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. గవర్నర్‌గా ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణంగా పేర్కొన్నారు. గవర్నర్‌గా అశోక్‌ను నియమించిన రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అశోక్‌గజపతి విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్‌, ఇతర రాష్ట్ర మంత్రులు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు.
ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ అరంగ్రేటం
అశోక్‌ గజపతిరాజు ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. ఆయన 1951 జూన్‌ 26న జన్మించారు. గ్వాలియర్‌లోని సింధియా, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. జయప్రకాశ్‌ నారాయణ, జార్జ్‌ ఫెర్నాండెజ్‌, చంద్రశేఖర్‌ వంటి సోషలిస్టు నాయకుల ఉపన్యాసాలకు అశోక్‌ ప్రభావితమయ్యారు. 1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరపున విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు… 1982లో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో ఎక్సైజ్‌, వాణిజ్య, ఆర్థిక, రెవెన్యూ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు