విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల పరిధిలోని హెచ్. శోధనపల్లి గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీహెచ్‌ఏ వనిత మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని పేర్కొన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరిగి అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. జననం నుంచి తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలని, నీరు సహా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదని సూచించారు.ఆరు నెలల అనంతరం అనుబంధ ఆహారం ప్రారంభించినప్పటికీ రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం ద్వారా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని వివరించారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యానికే కాకుండా తల్లి ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు.తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి ప్రతి బాలింతకు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త పద్మావతి, అంగన్‌వాడీ కార్యకర్త సులోచన, గర్భిణులు, బాలింతలు, గ్రామ ప్రజలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
హెచ్. శోధనపల్లిలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన…
- Advertisement -


