Home Blog Page 1459

చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, కోట్లాది ప్రజల ఆంకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మన దశాబ్దాల కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా అని కితాబునిచ్చారు. సోనియా 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినమని… 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వచ్చిందని ఆయన చెప్పారు. నా తెలంగాణ… కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు సత్యమని అన్నారు. ఏ జాతికైనా ఆ జాతి అస్తిత్వమే గుర్తింపు అని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటంలో సకల జనులను ఏకం చేసింది తెలంగాణ తల్లి అని రేవంత్ అన్నారు. ప్రజలను నిరంతరం చైతన్యపరిచి, లక్ష్యసాధన వైపు నడిపిన తల్లి తెలంగాణ తల్లి అని చెప్పారు. తెలంగాణ తల్లికి గుర్తింపు లేదని… ప్రజాపోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.తెలంగాణ తల్లి అంటే కేవలం భావన మాత్రమే కాదని… 4 కోట్ల ప్రజల భావోద్వేగం అని రేవంత్ అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్రహానికి రూపకల్పన చేశామని తెలిపారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. ప్రశాంత వదనంతో, సంప్రదాయ కట్టుబొట్టుతో విగ్రహాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గుండుపూసలు, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో విగ్రహాన్ని తయారు చేశామని చెప్పారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు తల్లి చేతిలో కనిపించేలా చేశామని చెప్పారు. పీఠంలోని నీలి రంగు… గోదావరి, కృష్ణమ్మల గుర్తులని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలపై బీజేపీ ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలపై కేంద్రంలోని అధికార బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌ ఆర్థిక సాయం అందిస్తున్న గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణాస్త్రాలు సంధించింది. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలనే ఆలోచనలకు ఆ సంస్ధ మద్దతిస్తోందని, సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకోవడం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతోందని బీజేపీ అభివర్ణించింది. దేశాన్ని అస్థిర పరచాలనుకునే సంస్థలకు కాంగ్రెస్ మద్దతిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీజేపీ ఆదివారం వరుసగా పోస్టులు పెట్టింది. ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌కు (ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్) కో-ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా గాంధీ.. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందే సంస్థతో సంబంధాలు పెట్టుకున్నారని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్టు ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్ ఇదివరకే స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపిందని పేర్కొంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి దారితీసిందని బీజేపీ పేర్కొంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు దేశంలో విపక్ష పార్టీతో సోరోస్ ఫౌండేషన్, మీడియా పోర్టల్ ఓసీసీఆర్‌ఫ్ జతకట్టాయని ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తాను 10 ప్రశ్నలు అడుగుతానని నిషికాంత్ దూబే చెప్పారు. జార్జ్ సోరోస్‌ తనకు పాత స్నేహితుడని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ బహిరంగంగా అంగీకరించారని, ఇది గమనించాల్సిన విషయమని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 కీలక బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రైతు భరోసా విధివిధానాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.

ఐసిస్ శిబిరాలపై అమెరికా దాడులు

సిరియాలో అనూహ్యమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ కుటుంబాన్ని తీసుకొని రష్యాకు పారిపోయినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్సాద్ పాలనకు ముగింపు పడింది. కాగా సిరియాలో అంతర్యుద్ధం పరిస్థితులను అదునుగా భావించిన అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థ ఐసిస్ స్థావరాలపై దాడులు మొదలు పెట్టింది. అస్సాద్ రష్యాకు పారిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఐసిస్ లక్ష్యాలపై ఆదివారం డజన్ల కొద్దీ దాడులు చేసింది. దేశంలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులను అవకాశంగా మలచుకొని తిరిగి బలపడాలని ఐసిస్ చూస్తోందని, తాము అలా జరగనివ్వబోమని, ాస్పష్టమైన ఆలోచన్ణతో ఐసిస్ లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్ష భవనం నుంచి ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఐసిస్ స్థావరాలపై ఆదివారం దాడులు జరిపామని, తమ యుద్ధ విమానాలు డజన్ల కొద్దీ శిబిరాలను తాకాయని యూఎస్ మిలిటరీ నిర్ధారించింది. బీ-52, ఎఫ్-15, ఏ-10తో పాటు యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానాలను ఉపయోగించి సెంట్రల్ సిరియాలోని 75కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా సిరియాలో అధ్యక్షుడు అస్సాద్ పాలన పతనమవ్వడం న్యాయమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంగా బాధపడుతున్న సిరియా ప్రజలకు ఇది చారిత్రాత్మక అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బషర్ అల్ అస్సాద్, అతడి కుటుంబం రష్యా పారిపోయి అక్కడ ఆశ్రయం పొందినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాగా గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్సాద్ కుటుంబ పాలనపై ఇస్లామిస్ట్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) అనే గ్రూపు మెరుపు దాడికి తెగబడింది. అమెరికా మద్దతున్న ఈ గ్రూపు దళాలు 11 రోజుల్లోనే సిరియాను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.

నంద్యాల జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌.. బాలిక‌కు నిప్పంటించిన బాలుడు !

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఘ‌ట‌న
ప్రేమించ‌లేద‌నే కార‌ణంతో బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాలుడు
బాలిక మృతి.. బాలుడికి తీవ్ర గాయాలు

ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమించ‌లేద‌నే కార‌ణంతో బాలిక‌పై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ బాలిక మృతిచెందింది. బాలుడికి కూడా మంట‌లు అంటుకోవ‌డంతో గాయాల‌య్యాయి.పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. వెల్దుర్తి మండ‌లం సామ‌ర్లకోట‌కు చెందిన బాలిక, క‌లుగొట్ల‌కు చెందిన బాలుడు ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్నారు. అయితే, బాలుడు కొంత‌కాలంగా బాలిక‌ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విష‌యం బాలిక త‌న పేరెంట్స్‌కు చెప్పింది. దాంతో వారు బాలిక‌ను ఆమె అమ్మ‌మ్మ ఉండే నందికొట్కూరుకు పంపించారు.అయినా బాలుడి వేధింపులు ఆగ‌లేదు. ఆరు నెల‌ల క్రితం అత‌డు నందికొట్కూరుకు వెళ్లాడు. ఈ విష‌యాన్ని కూడా బాలిక త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేసింది. దాంతో వారు బాలిక స్నేహితులు ఎవ‌రు వ‌చ్చినా ఇంటికి రానివ్వొద్ద‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఆదివారం అర్ధ‌రాత్రి దాటాక ఆ బాలుడు ఆమె ఉంటున్న ఇంటికి మ‌ళ్లీ వెళ్లాడు. బాలిక నిద్రిస్తున్న గ‌దికి వెళ్లి త‌లుపు కొట్టాడు. దాంతో బాలిక డోర్ తెరిచింది. వెంట‌నే లోప‌లికి వెళ్లిన బాలుడు గ‌డియ పెట్టేశాడు. ఆ త‌ర్వాత కాసేప‌టికే బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.దాంతో బాలిక గ‌ట్టిగా కేకలు పెడుతూ అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయింది. బాలుడికి కూడా నిప్పు అంటుకోవ‌డంతో గ‌డియ తీసి బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టాడు. అత‌డు పారిపోతుండ‌గా కుటుంబ స‌భ్యులు, స్థానికులు ప‌ట్టుకున్నారు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు అక్క‌డికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాలిన గాయాల‌తో ఉన్న అత‌డిని 108 వాహ‌నంలో క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. బాలిక త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని వారు కోరుతున్నారు.

ఏ డి పి ప్రాంగణ నియామక శిబిరంలో ఏపీ సి యూ విద్యార్థుల అద్భుత విజయం

విశాలాంధ్ర-అనంతపురం : జంతలూరులోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో క్లౌడ్ ఆధారిత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ మరియు బిజినెస్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్‌లో గ్లోబల్ లీడర్ అయిన ఏ డి పి కంపెనీ కోసం రెండురోజుల ప్రాంగణ నియామక శిబిరం విజయవంతంగా నిర్వహించినట్లుఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం నుండి 34 మంది, అనంతపురం మరియు చుట్టుపక్కల ఇతర సంస్థల నుండి 112 మంది, మొత్తంగా 146 మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొన్నారు. వీరిలో 52 మంది విద్యార్థులు ఆన్‌లైన్ మూల్యాంకనంలో ప్రతిభ కనబరచగా, 32 మంది వాయిస్ మరియు యాక్సెంట్ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులయ్యారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి అభిషేక్ మణి త్రిపాఠి, అల్మాస్ ఫాత్మా, క్రిష్ సూద్, చదువుల సృజన, రిమి కుమారిలు, సంభవ్ ఫౌండేషన్ నుండి పి. తస్లీమ్ ఏ డి పి కి ఎంపికయ్యారన్నారు.
ఎంపిక విధానం రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్, వాయిస్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలతోపాటు చివరిగా హెచ్ ఆర్ ఇంటర్వ్యూ వంటి వివిధ దశలలో జరిగిందన్నారు. వారి కృషి పట్ల ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి, అకడమిక్ డీన్ ఆచార్య సి. షీలారెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఆచార్య జి. రామ్ రెడ్డి, ప్లేస్‌మెంట్ సెల్ సభ్యులు, ఏ డి పి ప్యానెల్ సభ్యులు అభినందించారు.

ఉపాధ్యాయుడి మృతికి నల్ల బ్యాడ్జీలతో నిరసన

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడి మృతికి నిరసనగా పీటీఎల్యూ పిలుపు మేరకు శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రసాద్, పుల్లయ్య, రామకృష్ణ, శామ్యూల్, అశోక్ లు మాట్లాడుతూ ఇటీవల రాయచోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడు మృతి చెందడం దారుణమన్నారు. దాడిని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. విద్యా బుద్దులు, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పే ఉపాధ్యాయుడిపై విచక్షణరహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి పూజ వేడుకలు..

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని ఎస్ఎల్వీ మార్కెట్ పాత బస్టాండ్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగులకట్ట ఆలయంలో భక్తాదుల , అర్చకులు విజయ్ కుమార్ శర్మ నడుమ సుబ్రహ్మణ్య షష్టి పూజ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు.

సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారదోలుదాం…. జిల్లా ఎస్పీ రత్న

విశాలాంధ్ర ధర్మవరం;; సమిష్టి కృషితో డ్రగ్సును పారదోలుదామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ పేరెంట్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తదుపరివారు డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు , సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు.మత్తుకు దూరంగా ఉండండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 నెంబరుకు తెలపాలని,అందరూ సమిష్టి కృషితో డ్రగ్ అనే మత్తు పదార్థాన్ని పారదోలుదామని తెలిపారు. తొలుత జిల్లా ఎస్పీ కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ , ,ఆన్లైన్ మోసాలు , సైబర్ నేరాలపై ఏర్పాటుచేసిన పోస్టర్ల వాటిపై ఎస్పీ ఉపాధ్యాయులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మీటింగ్ లో పాల్గొని పోలీసు పరంగా డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.ముఖ్యంగా యువత ఎక్కువుగా గంజాయికు అలవాటుపడి బంగారు భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటున్నారని , యువతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పేరుతో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి జిల్లాలోను ఈ టాస్క్ ఫోర్స్ విభాగం ఉంటుందన్నారు. గంజాయి విస్తరించడంలో కీలకపాత్ర పోషించే ఫెడ్లర్స్, ట్రాన్సుపోర్టర్స్, కంజూమర్స్ పై దృష్టిపెట్టి వాటిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు తెలిపిన వారిని గోప్యంగా ఉంచుతామన్నారు.
ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో చెలగాటమాడే గంజాయిను సమిష్టిగా నిరోధించాలన్నారు. ముఖ్యంగా యువత మేల్కొని గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. డ్రగ్స్ వాడే విద్యార్థులలో ఉన్నట్లుండి లక్షణాలులో మార్పులు మనం గమనించవచ్చన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడడం వల్ల విచక్షణ కోల్పోయి పిల్లలపై అగత్యాలకు పాల్పడుతున్నారు.
తమ పిల్లలకు రోజు బడికి వెళ్తున్నారా లేదా ఎవరితో వెళ్తున్నారు ఎప్పుడొస్తున్నారని ఎప్పటికప్పుడు వారిపై తప్పక దృష్టి పెట్టాలని సూచించారు. ఏ మార్పు అయినా సరే ప్రభుత్వ బడుల నుంచే మొదలవ్వాలని తెలిపారు.
తాను కూడా పదో తరగతి వరకు ప్రభుత్వ బడులను చదువుకున్నా నని తెలిపారు.
దీంతో పాటు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెల్ ఫోన్లు వాడకం కూడా జోరందుకుందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉందని దుర్వినియోగానికి ఉపయోగించరాదన్నారు. మంచికి మాత్రమే వినియోగించాలి అని,ఇంటర్నెట్ , ట్యాబ్ లు వినియోగం దుర్వినియోగం కాకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఏవిపడితే అవి పోస్టులు పెట్టడం, ఫోర్నోగ్రఫీ చూడటం లాంటివి చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లు తెలియజేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లలు ఎటువంటి వ్యామోహాలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆడపిల్లల యొక్క బలం చదివేనని , బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలో నిజం చేయాలన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని, అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరస్తుల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల గురించి క్షుణ్ణంగా వివరించారు. డబ్బు ఎవరు ఫ్రీగా ఎవరూ ఇవ్వరు అని తెలుసుకోవాలన్నారు. డిజిటల్ రంగంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నామని… ఉద్యోగాల పేరున మోసాలు, ఆన్లైన్ లో అరెస్టు చేస్తామని నకిలీల బెదిరింపులు… ఇలా సైబర్ మోసాలపై అవగాహన చేశారు. ఫోక్సో చట్టం గురించి తెలియజేశారు.అనంతరం పిల్లల బంగారు భవిష్యత్తుకు… శారీరక, మానసిక, నైతిక వికాసానికి పాటుపడదామని ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తమ జీవిత లక్ష్యం ఐపీఎస్ కావాలని కొందరు విద్యార్థులు ఎస్పీ మేడం తో మంచి క్రమశిక్షణతో చదువుకొని, ముందుకెళితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు విద్యార్థులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు , ఎంఈఓ గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి, ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ , ఎస్బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి,పట్టణ టూ టౌన్ సిఐ రెడ్డప్ప , ఎస్బిఎస్ఐ ప్రదీప్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు, పాఠశాల కమిటీ తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే విద్యార్థి భవిష్యత్తుకు భరోసా

విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : మండలంలోని చుక్కలూరు హై స్కూల్, పట్టణంలోని సుధా శ్రీరాములు హై స్కూల్, ఏపీ మోడల్ హై స్కూల్లలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా తల్లిదండ్రుల – ఉపాధ్యాయుల సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు బోధించే చదువును శ్రద్ధతో చదివి, ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అలాగే ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటూ, క్రమశిక్షణతో మెలగాలన్నారు. అంతేకాకుండా విద్యతోనే ప్రతి విద్యార్థికి భవిష్యత్తుకు భరోసా అన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నాగరాజు, రామ గోవిందరెడ్డి పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్, విద్యార్థులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.