విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ విమర్శించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ ఆఫీసు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజలకు తెలియజేశారు. ఆర్డీఎస్ కుడి కాలువ పనులు పూర్తి చేయాలని, పెద్దకడబూరు నుండి బైచిగేరి బైపాస్ వరకు రోడ్లు మరమ్మతలు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కల్లుకుంట బైపాస్ రోడ్డును సిసి రోడ్ వేయాలని , డ్రైనేజీలు, వీధిలైట్లు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎస్సీ కాలనీలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ నందు గుంతల పడిన రోడ్డును సీసీ రోడ్డు వేయాలన్నారు. ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇవ్వాలని, నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇవ్వాలని, రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేయాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలంటూ పాదయాత్ర ద్వారా ప్రతి కాలనీ తిరుగుతూ ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శిలు కుమ్మరి చంద్ర, తిక్కన్న, నాయకులు నాగరాజు, అంజి, రాజు, రమేష్, తిక్కన్న, కడబూరి, దస్తగిరి ఆంజనేయ , బొడ్డన్న తదితరులు పాల్గొన్నారు.


