డిసిసి అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి
సంతకాల సేకరణను ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని డిసిసి అధ్యక్షులు వై.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.గురువారం ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక కవిత హోటల్ సమీపంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని ఆరోపించారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు ఆయుధమని అన్నారు. అటువంటిది బిహార్లో 65.6 లక్షల ఓట్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దేశంలో బిజెపి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఈసీ ప్రధాన భూమిక పోషిస్తుందని వారు ఆరోపించారు. బిజెపి దేశంలో అధికారంలోకి రావడానికి ఇలాంటి తప్పుడు పద్ధతులను అవలంబిస్తుందని వారు దుయ్యబట్టారు. 2024లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో మోడీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై దొంగ ఓట్లు ఈవీఎం లు ట్యాంపరింగ్ చేయడం వల్ల మూడోసారి గెలిచి అధికారంలోకి వచ్చారన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎన్ డి ఏ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. ఈ అక్రమాలు అన్నింటినీ ప్రశ్నిస్తున్న బయట పెట్టిన పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై కేసులు నమోదు చేస్తామని ఎలక్షన్ కమిషన్ బెదిరింపులకు దిగడం ఆ ప్రజాస్వామికమన్నారు. ఇప్పటికే దేశంలో ఎలక్షన్ కమిషన్ తో పాటు ఈడి, ఇన్కమ్ టాక్స్, సిబిఐ, ఆర్.బి.ఐ స్టాక్ ఎక్సేంజ్ లాంటి అన్ని వ్యవస్థలు మోడీ గుప్పెట్లో ఉండడం వల్ల ఆ వ్యవస్థలన్నీ బిజెపి కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి దేశ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలన్నారు. అంతకుముందు వారు స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహం నుంచి కవిత హోటల్ సమీపం వరకు ప్లే కార్డులు పట్టుకొని బిజెపి, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సోనియా సీన, భాళ్య ప్రసాద్, అలం నావజ్, నబిరసులు, భోజ్జప్ప,సోయబ్, సుధాకర్, చంద్ర, వడ్డే శీనా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


