మద్యానికి బానిస అవుతున్న యువత
శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విచ్చలివిడి బెల్ట్ షాపుల వల్ల మద్యానికి యువత బానిస అవుతుందని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి గురువారం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం బెల్ట్ షాపులు ఉండవని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే 43 వేల బెల్ట్ షాపులను నిర్వహిస్తుందని ప్రతి గ్రామంలో కూడా 8 నుంచి 15 వరకు అక్రమంగా మద్యం బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గుడి, బడి ఇళ్ల మధ్య ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు ను నిర్వహిస్తున్నారు అన్నారు. విచ్చలి విడిగా మద్యం అందుబాటులో ఉండటం వల్ల అతి చిన్న వయసు యువకులు కూడా మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రాజన్న అనే వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని అలాగే జిల్లాకు చెందిన భాష అనే మరో వ్యక్తి అతిగా మద్యాన్ని సేవించి మృతి చెందాడని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వీరి కుటుంబాలకి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. బెల్ట్ షాపులలో కల్తీ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం బెల్ట్ షాపులను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు.


