- ఆయనపై నకిలీ సర్టిఫికెట్లు, ఆర్థిక అక్రమాలపై ఆరోపణలు
- మీడియా ఎదుట బహిరంగ చర్చకు రావాలి
- ఏపీఓఏలో మెజారిటీ నిరూపిస్తే ఎన్నికలు నిర్వహించాలి
- ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు..
విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : ఆర్కే పురుషోత్తం పైనే సిఐడి సిబిఐ విచారణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ) సెక్రెటరీ కేపీ రావు డిమాండ్ చేశారు. ఆర్.కె. పురుషోత్తంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన నకిలీ సర్టిఫికెట్ల అంశంపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని, గతంలో ఏపీఓఏ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, కుస్తీ ధ్రువపత్రాల వ్యవహారాలపై ఆయనపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీఓఏ నిధుల దుర్వినియోగం, పత్రాల తారుమారు, ఐఓఏ గుర్తింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేపీ రావు, ఈ అంశాలపై సీఐడీ లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆర్.కె. పురుషోత్తంకు ఏపీఓఏపై చట్టబద్ధమైన హక్కు లేదని, ఆయనకు నిజంగా మెజారిటీ మద్దతు ఉంటే ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఏఏపీ లేదా ఐఓఏను కోరాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగానికి సంబంధించిన సమస్యలపై పురుషోత్తం ఎప్పుడూ ప్రభుత్వ అధికారులను కలిసి స్పందించలేదని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలోని క్రీడా సంఘాల సభ్యుల సమక్షంలో మీడియా ఎదుట బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అలాగే, ఐఓఏ అధ్యక్షుడిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించినట్లు కేపీ రావు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లు, ఆర్థిక అక్రమాలపై ముందుగా పురుషోత్తం మద్దతుదారులపై చర్యలు తీసుకున్న తర్వాతే ఇతరులపై ఆరోపణలు చేయాలని కేపీ రావు డిమాండ్ చేశారు.


