సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపు
విశాలాంధ్ర – అనంతపురం : డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపునిచ్చారు.
డిసెంబర్ 10న జరగబోయే సిపిఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ, అనంతపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు అధ్యక్షతన, ఏఐవైఎఫ్,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ సి. మల్లికార్జున మాట్లాడుతూ… భారత రాజకీయ చరిత్రలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 ఏళ్ల ప్రయాణం ఒక అపూర్వ పోరాటగాథ అని పేర్కొన్నారు.
1925లో ప్రజా సమస్యలను అజెండాగా పెట్టుకుని ఏర్పడిన సీపీఐ, కూలీలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం దేశవ్యాప్తంగా భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా, కార్మికుల కనీస వేతనాల కోసం, రైతుల రుణమాఫీల కోసం, మహిళల స్వేచ్ఛ–భద్రత కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం నడిపిన పోరాటాలు భారత రాజ్యాంగ విలువలను బలపరిచాయన్నారు . సమానత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్య రక్షణ వంటి విలువలను కాపాడేందుకు పార్టీ ఎన్నో దశాబ్దాలుగా రాజ్యాంగవ్యాప్త దాడులను ప్రతిఘటిస్తూ ముందడుగు వేసిందన్నారు . ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలపై దాడులు, పబ్లిక్ రిసోర్సుల ప్రైవేటీకరణ, నిరుద్యోగం పెరుగుదల, విద్య–ఆరోగ్య రంగాల వాణిజ్యీకరణ రోజురోజుకూ తీవ్రమవుతున్నాయన్నారు . మత విద్వేషాలు, కార్పొరేట్ దోపిడీ, అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలపై పార్టీ రాబోయే రోజుల్లో యువత శంఖారావం పూరించాలని, దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందని తెలిపారు.
ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కమ్యూనిస్టు ఉద్యమం కోసం జీవితాలను అర్పించిన అమరుల త్యాగాలను పార్టీ చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో పోరాటాల్లో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ప్రత్యేక సన్మానం ఈ శతాబ్ది ఉత్సవాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… డిసెంబర్ 10న అనంతపురంలో జరగబోయే శతాబ్ది ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, ప్రజలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవా ధనుంజయ నగర కార్యదర్శి శ్రీనివాస్ ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్, ఉమామహేశ్వర్, జిల్లా ఆఫీస్ బేరర్స్, చందు, ఆంజనేయులు, వెంకట్ నాయక, రాజు, రాజేష్,వినోద్, తిర్లోక్ సాయి, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు..


