సిపిఐ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; ఎన్డీఏ ప్రభుత్వం సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముదిగుబ్బ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆ పార్టీ మండల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించడానికి కరెంట్ ఆఫీస్ లో అధికారులు అందుబాటులో లేకపోవడంలో గత్యంతరం లేక తమ వినతి పత్రాన్ని విద్యుత్ శాఖ కార్యాలయం గోడకు అతికించి నిరసన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకులు చల్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వంలో చార్జీల పెంపుదలను, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తాను కూడా చార్జీలను పెంచడమే గాక స్మార్ట్ మీటర్లను కూడా అమర్చుతుండడం దారుణం అని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్ చార్జీల పేరుతో దాదాపు నాలుగు సార్లు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడమే గాక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల స్మార్ట్ మీట్లను బిగించడం జరిగిందని ఆరోపించారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదాని కంపెనీతో చేసుకున్న ఒప్పందం వల్ల రాబోయే 25 ఏళ్ల వరకు దాదాపు లక్ష పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం పడనున్న నేపథ్యంలో దాన్ని పునః సమీక్షించి ఆ భారం ప్రజల మీద పడకుండా ప్రత్యాన్మయ్య చర్యలు తీసుకోవాల్సి ఉండగా అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా జగన్ తరహాలోనే సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచడమే కాకుండా నేడు అదే స్మార్ట్ మీటర్లను తిరిగి అమర్చుతూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడానికి ప్రయత్నాలు చేస్తుండడం
దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సుమారు 15 వేల కోట్లకు పైగా సర్ చార్జీలు పేరుతో విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపడం జరిగిందన్నారు, కనుక ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించడమే గాక స్మార్ట్ మీటర్లునుకూడా రద్దు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు,
లేని పక్షంలో త్వరలోనే కరెంటు వినియోగదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య, రైతు సంఘం నాయకులు డాబా రామకృష్ణ ,గంగిరెడ్డిపల్లి నాయుడు లతోపాటు స్థానిక నాయకులు
ఆ దెబ్బ, తుమ్మల చిన్నప్ప, ముత్తులూరి మధు, కొండయ్య, గణేష్ యాదవ్, సోమల నరసింహ తదితరులు పాల్గొన్నారు.