Homeఆంధ్రప్రదేశ్‘మన ఇల్లు - మన లోకేశ్‌‘ కార్యక్రమంలో 3 వేల మందికి పట్టాల పంపిణీ

‘మన ఇల్లు – మన లోకేశ్‌‘ కార్యక్రమంలో 3 వేల మందికి పట్టాల పంపిణీ

- Advertisement -

ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేరుస్తూ, బట్టలు పెట్టి పట్టాలిస్తా అన్న మాటను నిలబెట్టుకున్నానని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరిని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ‘మన ఇల్లు – మన లోకేశ్‌ ‘ కార్యక్రమం కింద మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది పేదలకు శాశ్వత భూహక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తమ ఇళ్లు, స్థలాలను ఎవరైనా లాక్కుంటారేమోనన్న భయంతో బతికిన ప్రజలకు ఈ రోజుతో ఆ భయం తొలగిపోయింది. కూటమి ప్రభుత్వం మీకు శాశ్వత హక్కును కల్పిస్తోంది. సుమారు రూ.1000 కోట్ల విలువైన ఈ భూమి ఇకపై మీ సొంతం. అవసరాలకు బ్యాంకులో పెట్టి రుణం కూడా తీసుకోవచ్చుఁ అని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పానని, ఈ రోజు ఆ హామీని నెరవేర్చడం సంతోషంగా ఉందని తెలిపారు.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని లోకేశ్‌ గుర్తుచేసుకున్నారు.కొడుకును గెలిపించుకోలేకపోయావని మా నాన్నను కూడా అవమానించారు. కానీ, ఐదేళ్లు మీ మధ్యే ఉండి మీ మనసు గెలుచుకోవాలని నిర్ణయించుకున్నా. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలలో ఒకటి ఇచ్చి నన్ను గెలిపించారు. మీరిచ్చిన ఈ బలమే నన్ను ముందుకు నడిపిస్తోందిఁ అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.

కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తోందని లోకేశ్‌ అన్నారు. రూ.4 వేల పింఛను, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదని, రూపాయి ఆదాయానికి రూ.1.40 పైసల ఖర్చు ఉందని, అయినప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని లోకేశ్‌ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు