స్టడీ మెటీరియల్ ను అందజేస్తున్న ఎస్టియు నాయకులు
విశాలాంధ్ర -ఆస్పరి : విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని హాలిగేర, చిన్నహోతూరు, జోహారాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రతి విద్యార్థి పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విద్యా సంవత్సరం 272 పేజీలతో కూడిన అన్ని సబ్జెక్టులు ఒకే పుస్తకంగా రూపొందించిన 10వ తరగతి బుల్లెట్ స్టడీ మెటీరియల్‌ను, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అకాడమిక్ కమిటీ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సహకారంతో రూపొందించారని తెలిపారు. ఈ స్టడీ మెటీరియల్ పదవ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ప్రశంసించారు. విద్యార్థుల విద్యాప్రగతికి నిరంతరం కృషి చేస్తున్న ఎస్టీయూ సేవలు అభినందనీయమని, ప్రతి పాఠశాలకు ఈ పుస్తకాలను దాతల సహకారంతో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ సీనియర్ నాయకులు జ్యోతి మూర్తి, శ్రీనివాసులు, లక్ష్మీపతి, నరసింహులు, నాగరాజు, ఎస్టీయూ మండల ప్రెసిడెంట్ ఉరుకుందు, మండల కార్యదర్శి రామాంజనేయులు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


