కుటుంబంలో విషాదం….
విశాలాంధ్ర – నార్పల ( అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని రామస్వామి వీధి (దూల్పేట్ కాలనీ)లో అప్పుల బాధ తట్టుకోలేక రైతు చిలమకూరి ఆదినారాయణ (41) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.వివరాల ప్రకారం, ఆదినారాయణకు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత ఐదేళ్లుగా మిరప, టమోటా, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తూ వచ్చారు. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వరుసగా నష్టాలు చవిచూశారు. వ్యవసాయ ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం బయట వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.7 లక్షల మేర అప్పులు చేశారు.పంటల ద్వారా ఆశించిన ఆదాయం రాకపోవడం, అప్పులు తీర్చలేకపోవడం, వడ్డీ భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదినారాయణ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.మృతుడికి భార్య నాగేశ్వరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాగేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.


