Homeఆంధ్రప్రదేశ్పొగాకు రైతు విలపిస్తున్నా పట్టించుకోని పాలకులు

పొగాకు రైతు విలపిస్తున్నా పట్టించుకోని పాలకులు

- Advertisement -

గిట్టుబాటు ధర కోసం 19న ఒంగోలులో రైతుల గర్జన

  • రూ.1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టాలి
  • ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని SKM పిలుపు
  • విశాలాంధ్ర నాగులుప్పలపాడు: వర్జీనియా పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై రైతు సంఘాలు మండిపడ్డాయి. పొగాకు ధరలు పతనమై రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే పాలకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గిట్టుబాటు ధర సాధన కోసం ఈ నెల 19న ఒంగోలులో నిర్వహించనున్న భారీ ట్రాక్టర్ ర్యాలీని రైతాంగం విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నాయకులు పిలుపునిచ్చారు.
    మూడు రోజులుగా కొనసాగుతున్న రైతు చైతన్య ప్రచార జాతరలో భాగంగా సోమవారం హెచ్.నిడమానూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన SKM జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, AIKMS జిల్లా నాయకుడు సి.ఎస్.సాగర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.వీరారెడ్డి రైతులతో సమావేశమయ్యారు.
    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పొగాకు ధర రూ.16 వేల వరకు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు కనీసం రూ.30 వేల ధర లభిస్తేనే రైతు కుటుంబాలు అప్పుల బారినుంచి బయటపడగలవని పేర్కొన్నారు.
    నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు కుమ్మక్కై రైతులను దోచుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
    పొగాకు రైతుల మనుగడ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి గ్రామం నుంచి రైతులు ట్రాక్టర్లతో భారీగా తరలివచ్చి ఒంగోలు ట్రాక్టర్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. రైతాంగ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు