Homeక్రీడలురేపు మంగళగిరి స్టేడియం కు హీరో రామ్ చరణ్

రేపు మంగళగిరి స్టేడియం కు హీరో రామ్ చరణ్

- Advertisement -
  • మ్యూజిక్ తో అలరించునున్న తమన్
  • ఈ నెల 24 నుండి 30 వరకు మంగళగిరిలో ఏపీఎల్
  • సెమీఫైనల్స్ ఫైనల్ కు సైతం వేదికగా మంగళగిరి*
  • సర్వాంగ సుందరం గా సిద్ధమైన మంగళగిరి స్టేడియం
  • స్టేడియం లో 75 గదులు, ఆధునిక వసతులతో కొత్త రూపు
  • ఫైనల్‌కు ముఖ్య అతిథిగా నారా లోకేష్
  • క్రీడల అభివృద్ధే ఏసీఏ లక్ష్యం ఏసిఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
    విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోటీలు ఇప్పుడు రాజధాని ప్రాంతం అమరావతిలోని మంగళగిరి వేదికగా జరగనున్నాయి. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రకటించారు.రేపటి మ్యాచ్ కు ముఖ్య అతిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నారు.అటు మ్యూజిక్ తో తమన్ ప్రేక్షకులను అలరించునున్నారు. జూన్ 9న విశాఖపట్నంలో ప్రారంభమైన ఏపీఎల్ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అనంతరం కడపలో జరిగిన మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించిందని, ఇప్పుడు మంగళగిరిలో తుది దశ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. వర్షాలు లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైతే ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ డే కూడా కేటాయించినట్లు వెల్లడించారు. కడపలో జరిగిన మ్యాచ్‌లకు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారని, స్టేడియం సామర్థ్యం 7 వేల నుంచి 8 వేల మంది మాత్రమే ఉన్నప్పటికీ 10 వేల నుంచి 15 వేల మంది వరకు అభిమానులు హాజరయ్యారని చెప్పారు. వారాంతం కాకపోయినా సాధారణ పనిదినాల్లోనే మధ్యాహ్నం, సాయంత్రం జరిగే మ్యాచ్‌లకు భారీ స్పందన రావడం ఏపీఎల్ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు…
    మంగళగిరి స్టేడియం ప్రత్యేకతలు
    మంగళగిరి స్టేడియం నిర్మాణ పనులు 2013లో ప్రారంభమయ్యాయి ఈ స్టేడియం పూర్తి నిర్మాణం 2015 లోగ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల 2019 వరకు పనులన్నీ నత్త నడకన సాగాయి ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ స్టేడియంలో గాలికి వదిలేసింది మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీఏ గౌరవ అధ్యక్షుడిగా కేసినేని శివనాధ్ చిన్ని బాధ్యతలు చేపట్టాక మంగళగిరి స్టేడియానికి ఒక కొత్త రూపురేఖలు వచ్చాయి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని చిన్ని తెలిపారు. విశాఖపట్నం స్టేడియానికి ఏమాత్రం తీసిపోకుండా సౌకర్యాలు కల్పించారు తొలుతగా ప్లేయర్స్ మరియు మ్యాచ్ అఫీషియల్స్ ఏరియాను పూర్తిగా సిద్ధం చేశారు అందులో ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్, డైనింగ్ రూమ్స్, సురక్షితమైన టాయిలెట్స్,మ్యాచ్ రిఫరీ,గదులు స్కోరర్ గదులు, ప్రసార మరియు ఓటిటి గదులు, కామెంట్రీ బాక్సులు, 5 సూట్ రూమ్స్ తో సహా 70 గదులు, తూర్పు మరియు పడమర సాధారణ టాయిలెట్స్,స్టేడియం పెయింటింగ్ మరియు సుందరీకరణ పనులు, కాంపౌండ్ వాల్ మరియు గేట్లు, ప్రసార ప్రయోజనం కోసం 2000లక్స్ కాంతినిచ్చే ఎత్తైన ఫ్లెడ్ లైట్స్, జిమ్ రూమ్, ఇండోర్ ప్రాక్టీస్ రూమ్, ఆటగాళ్ల భోజనశాల మరియు వంటగది ని సైతం సర్వహంగులతో సిద్ధం చేశారు ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఎల్‌తో పాటు త్వరలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పోటీలు కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బీసీసీఐ షెడ్యూల్‌తో పాటు ఏపీఎల్, మహిళల లీగ్‌లను కలిపి చూస్తే ఏడాదిలో దాదాపు 200 రోజులు ఈ స్టేడియం వినియోగంలో ఉండే అవకాశముందని వివరించారు.
    ఫైనల్ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా లోకేష్
    జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రికెట్ సంఘాలతో పాటు బీసీసీఐ అనుబంధ సంఘాల ప్రతినిధులను కూడా ఫైనల్‌కు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బీసీసీఐ నుంచి కూడా పలువురు ప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
    దేశం లో ఏపీఎల్ కు అత్యంత ఆదరణ
    భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో లీగ్ పోటీలు ఒక్కో నగరానికే పరిమితమవుతున్నాయని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కడప, మంగళగిరి వంటి మూడు వేదికల్లో పోటీలు నిర్వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రజలకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో విశాఖపట్నంలో మరో అత్యాధునిక కేంద్రం కూడా సిద్ధమవుతుందని తెలిపారు. క్రీడల అభివృద్ధే ఏసీఏ ప్రధాన లక్ష్యమని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు ఏపీఎల్ గొప్ప వేదికగా నిలుస్తోందన్నారు. ఐపీఎల్ ద్వారా దేశానికి అనేక మంది ప్రతిభావంతులు లభించినట్లే, ఏపీఎల్ ద్వారా కూడా భవిష్యత్ అంతర్జాతీయ క్రికెటర్లు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏసీఏలోని అపెక్స్ బాడీ సభ్యులు, సీఈఓ, సీఓఓ, గేమ్ డెవలప్‌మెంట్ అధికారులు, సిబ్బంది గత రెండు నెలలుగా నిరంతరం శ్రమించి మూడు వేదికలను సిద్ధం చేశారని కొనియాడారు. వారి కృషి వల్లే ఏపీఎల్ దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందుతున్న రాష్ట్ర లీగ్‌లలో ఒకటిగా నిలుస్తోందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దేశంలోని అత్యంత ధనిక సంఘాల్లో ఒకటి కాదని, పరిమిత వనరులతోనే స్టేడియాల అభివృద్ధి, లీగ్ నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, స్పాన్సర్లు, దాతలు అందిస్తున్న సహకారంతోనే ఈ కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని చెప్పారు.
    మంగళగిరి స్టేడియం సామర్థ్యం
    మంగళగిరి స్టేడియానికి మొత్తం 26 వేల మంది సామర్థ్యం ఉన్నప్పటికీ భద్రతా కారణాల రీత్యా పై గ్యాలరీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సుమారు 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు అనువైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మిగిలిన పనులు పూర్తయిన తర్వాత సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
    ఏపిఎల్ రావడం వల్ల బాగుపడ్డ రహదారులు
    స్టేడియానికి చేరుకునే రహదారుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వెస్ట్రన్ బైపాస్‌కు కనెక్టివిటీ కల్పించే పనులు కొనసాగుతున్నాయని, రైల్వే గేట్ సమీపంలోని దెబ్బతిన్న రహదారులను కూడా మరమ్మతు చేస్తున్నట్లు తెలిపారు. మూడు ప్రధాన మార్గాల ద్వారా స్టేడియానికి సులభ రాకపోకలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
    అటు ఆట ఇటు పాట
    ప్రతి మ్యాచ్ రోజు ప్రేక్షకుల వినోదం కోసం ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు మ్యాచ్‌ల మధ్య సుమారు 45 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మీడియా సంస్థలు ఏపీఎల్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, యువ క్రీడాకారుల ప్రతిభను ప్రజలకు చేరవేయాలని కోరారు. పేద, గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చిన ఎంతో మంది యువ క్రికెటర్ల భవిష్యత్తు ఈ వేదికపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. మీడియా సహకారంతో వారి ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. క్రికెట్‌తో పాటు భవిష్యత్తులో ఇతర క్రీడల అభివృద్ధికి కూడా ఏసీఏ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రికెట్ ఈ దేశంలో ఒక మతం లాంటిదని, కడపలో కనిపించిన స్పందనకంటే మరింత భారీ స్పందన మంగళగిరిలో కనిపించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరినీ ఏపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఆహ్వానించారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు