వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టై ఇటీవల సోషల్ మీడియాలో అమితంగా చర్చనీయాంశమైంది.ఈ పేరు తాజాగా సుప్రీంకోర్టు విచారణలోనూ ప్రస్తావనకు వచ్చింది.వాట్సప్ ఖాతా పునరుద్ధరణపై దాఖలైన ఒక పిటిషన్‌ను పరిశీలించే సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఈ యాప్‌పై దృష్టిని మరింత ఆకర్షించాయి. వాట్సప్ లేకపోతే ఏముంది? అరట్టై వాడొచ్చు కదా అని కోర్టు సూచించింది.ఒక పౌరుడు తన వాట్సప్ ఖాతాను బ్లాక్ చేశారని, దాన్ని మళ్లీ యాక్టివ్ చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
సామాజిక మాధ్యమాలు వినియోగదారులను అకస్మాత్తుగా నిషేధించకుండా చూడటానికి గైడ్‌లైన్స్ అవసరమని కూడా ఆయన కోరారు.
మేక్ ఇన్ ఇండియా అని సూచన
దీనిపై విచారణ చేస్తూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 32 కింద ఈ వ్యాజ్యం ఎందుకు వేశారని ప్రశ్నించింది.వాట్సప్ యాక్సెస్ ప్రాథమిక హక్కా అని వ్యాఖ్యానించింది. దీనికి స్పందించిన పిటిషనర్ న్యాయవాది, పిటిషనర్ ఒక పాలీడయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉద్యోగి.గత 10-12 ఏళ్లుగా వాట్సప్ ద్వారానే తన క్లయింట్‌లతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ ఖాతా బ్లాక్ అయింది తఅని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై స్పందించిన ధర్మాసనం, కమ్యూనికేషన్ కోసం మరెన్నో యాప్‌లు ఉన్నాయి.అవి వాడుకోవచ్చు కదా! ఇటీవలే స్వదేశీ యాప్ అరట్టై వచ్చింది. దాన్ని ఉపయోగించండి. మేక్ ఇన్ ఇండియా అని సూచించింది.
ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరణ
ఈ పిటిషన్ హైకోర్టు పరిధిలోకీ రావడం లేదని వ్యాఖ్యానించిన కోర్టు, ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.పిటిషనర్ అనంతరం కోర్టు అనుమతితో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. జాతీయ సంస్థ జోహో, రూపొందించిన అరట్టై ప్రస్తుతం విశేష ఆదరణ పొందుతోంది.ఇప్పటికే దీన్ని కోట్లకు పైగా యూజర్లు డౌన్‌లోడ్ చేసినట్టు సమాచారం. తమిళంలో అరట్టై అంటే సాదాసీదా మాట్లాడటం లేదా పిచ్చాపాటీ సంభాషణ అని అర్థం.ఈ యాప్‌లో సందేశాలు పంపడం, వాయిస్, వీడియో కాల్స్ చేయడం, మీటింగుల్లో పాల్గొనడం, ఫొటోలు, స్టోరీలు, డాక్యుమెంట్లు పంచుకోవడం వంటి సదుపాయాలు ఉన్నాయి.
సులభమైన ఇంటర్ఫేస్, అనేక ఫీచర్లు, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలతో ఇది ప్రత్యామ్నాయ వేదికగా మంచి గుర్తింపు పొందుతోంది.


