Wednesday, February 18, 2026
Homeఅంతర్జాతీయంఅమెరికాలో.. ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు..!

అమెరికాలో.. ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు..!

- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మానవత్వం మంటగలుస్తోంది. అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో ఇమ్మిగ్రేషన్ అధికారులు (ICE) అనుసరిస్తున్న అనాగరిక పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తున్నాయి. మిన్నెసోటాలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన 5 ఏళ్ల బాలుడు లియామ్ రామోస్‌ను అధికారులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. అతని కుటుంబ సభ్యులను బయటకు రప్పించేందుకు ఆ చిన్నారినే ఒక పావుగా వాడుకున్నారనే వార్త విస్మయానికి గురిచేస్తోంది.

అగ్రరాజ్యం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఆంక్షల పేరుతో అధికారులు అనుసరిస్తున్న తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడు లియామ్ కొనెజో రామోస్‌ను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. (5 Year Old Boy Detain in US) ఆ చిన్నారిని ఎరగా వాడుకుని ఇంట్లోని ఇతరులను పట్టుకునేందుకు ప్రయత్నించారని స్కూల్ అధికారులు ఆరోపిస్తున్నారు.

స్కూల్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నిర్బంధించిన బాలుడి పేరు లియామ్‌ కోనెజో రామోస్‌గా పేర్కొన్నారు. 2024లో ఈ చిన్నారి కుటుంబం అమెరికాకు వలస వచ్చిందని తెలిపారు. బహిష్కరణకు సంబంధించి వారికి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదన్నారు.
అసలేం జరిగిందంటే..?
మంగళవారం మధ్యాహ్నం లియామ్ తన తండ్రితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. వారి డ్రైవ్‌వేలో మాస్క్ ధరించిన ఏజెంట్లు చుట్టుముట్టారు. బాలుడిని కారులో నుంచి దించి.. ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు అతనితోనే తలుపు కొట్టించారని స్కూల్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ వెల్లడించారు. “ఒక ఐదేళ్ల చిన్నారిని ఎరగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి బాబును తన వద్ద వదిలి వెళ్లమని వేడుకున్నా.. అధికారులు వినకుండా బాలుడిని, తండ్రిని టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.

అయితే ఈ ఆరోపణలను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తోసిపుచ్చింది. తాము చిన్నారిని లక్ష్యం చేసుకోలేదని.. అక్రమంగా దేశంలో ఉన్న అతని తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ కొనెజోను అరెస్ట్ చేసేందుకు వెళ్లామని తెలిపారు. ఏజెంట్లను చూడగానే తండ్రి పారిపోవడానికి ప్రయత్నించి బాబును అక్కడే వదిలేశాడని, అందుకే బాబు భద్రత దృష్ట్యా తమతో తీసుకెళ్లాల్సి వచ్చిందని అధికారులు వాదిస్తున్నారు.చిన్నారి తండ్రి అడ్రియన్‌ అలెగ్జాండర్‌ కోనెజో అరియాస్‌ ఈక్వెడార్ జాతీయుడని పేర్కొన్నారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న అతడిని.. అదుపులోకి తీసుకునేందుకు ఇమిగ్రేషన్‌ అధికారులు (ICE) ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. పిల్లాడి భద్రత కోసం ఓ అధికారి అతడితోనే ఉన్నట్లు వివరించారు.

పిల్లాడి నిర్బంధంపై వస్తున్న విమర్శలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) స్పందిస్తూ.. ఇమిగ్రేషన్‌ అధికారులు చిన్నారి తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ఇక, ఈ ఘటనను యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ (Kamala Harris) తీవ్రంగా ఖండించారు. ఇది తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు