తగ్గుతున్న ఎల్‌పీజీ నిల్వలు
విశాఖపట్నం: విశాఖ ఉక్కుపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) నిల్వలు తగ్గిపోవడంతో ఆ ప్రభావం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తిపై పడుతోంది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్ట్‌షాప్ (ఎసఎంఎస్) వద్ద బ్లూమ్స్‌ను కట్ చేయడానికి ఎల్‌పీజీ వాడతారు. ఎసఎంఎస్-2 వద్ద డీగ్యాసింగ్ ప్రక్రియలో, ఇంజినీరింగ్ షాప్‌లో వివిధ పనులకు ఎల్‌పీజీని వినియోగిస్తారు. రోజూ 4 వేల బ్లూమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది. వాటిని కట్ చేస్తేనే బెడ్ ఖాళీ అయ్యి నిరంతర కాస్టింగ్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ప్రక్రియలో రోజూ 10 వేల టన్నుల ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి అవుతుంది. ఎల్‌పీజీ సరఫరా లేకపోతే ఈ ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. ప్లాంట్ అవసరాలకు ప్రతిరోజూ 13 టన్నుల ఎల్‌పీజీ వినియోగిస్తారు. ప్లాంట్‌లో పూర్తి నిల్వ సామర్థ్యం 325 టన్నులు కాగా, ప్రస్తుత నిల్వలు పది రోజులకు మాత్రమే సరిపోతాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఐఓసీ ఎల్‌పీజీని సరఫరా చేస్తోంది. యుద్ధం వల్ల ఎల్‌పీజీ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో గృహ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆయిల్ కంపెనీలకు ఆదేశాలిచ్చింది. తాజాగా గృహ అవసరాలతో పాటు ఎరువులు, పవర్ ప్లాంట్లకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం సంకట స్థితిలో పడింది. 2022లో బొగ్గు సంక్షోభం తలెత్తినప్పుడు బాయిలర్ కోల్‌ను కేవలం పవర్ ప్లాంట్లకు మాత్రమే ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అప్పట్లో నెల రోజులపాటు విశాఖ ఉక్కుకు బాయిలర్ కోల్ అందకపోవడంతో సమస్యలు ఎదుర్కొంది. తాజాగా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఇలాంటి సంక్షోభాల సమయంలోనూ ఈ స్టీల్ ప్లాంట్‌కు ప్రాధాన్యమివ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విశాఖ ఉక్కులో ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ దిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులతో మాట్లాడారు. అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.


