విశాలాంధ్ర, ఉరవకొండ : స్థానిక శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణం కళకళలాడుతూ, విద్యార్థుల ప్రతిభతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రఘు రాములు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల ఆవిర్భవించి ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ నైతిక విలువలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విద్య అందిస్తున్నామని తెలిపారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచడం అవసరమని సూచించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు సమగ్ర అభివృద్ధిని కలిగించేలా నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు, పాటలు, నాటికలు ప్రదర్శించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.


