జేఈఈ మెయిన్ (JEE Main 2026) తొలి విడత పరీక్షలు విజయవంతంగా ముగియడంతో రెండో విడత పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 25వ తేదీ రాత్రి 9గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎన్టీఏ (NTA) ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ మధ్యలో JEE Main 2026 Session-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, అడ్మిట్ కార్డుల్ని తగిన సమయంలో విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది. రెండో విడత పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 20 నాటికి ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.
జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష రాసిన విద్యార్థులు సైతం రెండో సెషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం సెషన్-1లో సమర్పించిన అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావొచ్చు.పేపర్, పరీక్ష మీడియం, పరీక్ష రాయాలనుకొనే నగరం, విద్యార్హతలు వంటి వివరాలు నమోదు చేయడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా వివరాలేమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
కొత్తగా దరఖాస్తు చేసే విద్యార్థులైతే.. నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన బుక్‌లెట్‌లో వివరాలను చదివి అందులో సూచనల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్లు నింపడానికి వీలులేదు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షను దేశ వ్యాప్తంగా 13లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్ పరీక్షల్లో కనీస స్కోర్ సాధించిన రెండున్నర లక్షల మందికి(అన్ని సామాజికవర్గాల వారిని కలిపి) మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
హెల్ప్‌లైన్ నంబర్ ఇదే: దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 011-40759000/011-69227700 నంబర్లకు కాల్ చేయొచ్చు లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.


