ఆయనో నక్క అయితే, తాను దేశానికి విశ్వాసపాత్రమైన కుక్కనని వ్యాఖ్య
విద్యార్థుల నిరసనలపై షా గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ఈ వివాదం
బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో తింటూ, పొరుగు దేశం కోసం పోరాడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖుల మౌనం గురించి గతంలో నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి రాజుకుంది. ఇటీవల నటుడు పియూష్ మిశ్రా, నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను ప్రస్తావించిన ఓ వార్తను కంగనా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్‌ను ఉద్దేశిస్తూ.. ఁనిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి కుక్కలే. కానీ, నేను ఏ ఇంటి (దేశం) రొట్టె తింటున్నానో, ఆ ఇంటికి కాపలా కాస్తున్నందుకు, దాని కోసం పోరాడుతున్నందుకు గర్వపడుతున్నాను. నసీర్ సాబ్ ఈ దేశపు తిండి తింటారు. కానీ, పొరుగు దేశం కోసం పోరాడతారుఁ అని కంగనా రాసుకొచ్చారు. ఆయన్ను ఓ నక్క అని అభివర్ణించిన కంగనా, తాను మాత్రం విశ్వాసపాత్రమైన కుక్కగా ఉండటానికే ఇష్టపడతానని స్పష్టం చేశారు.గతంలో విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించినప్పుడు నసీరుద్దీన్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నోట్లో ఎముక ఉన్న కుక్క మొరగదు. ఆ ఎముక కిందపడగానే లేదా పళ్లు విరగ్గొట్టగానే అప్పుడు మొరుగుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా పియూష్ మిశ్రా మాట్లాడుతూ, షా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఏ కుక్కలు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ఈ వార్తను షేర్ చేస్తూనే కంగనా నసీరుద్దీన్‌పై విరుచుకుపడ్డారు.గతంలో కూడా కంగనా విద్యార్థుల ఉద్యమాలను విమర్శిస్తూ, యువతలో ఒక వర్గాన్ని ‘గట్టర్ చాప్‘ అని సంబోధించి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై విరుచుకుపడ్డ కంగనా రనౌత్
- Advertisement -


