కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కదిరిలో సీపీఐ భారీ ర్యాలీ..
విశాలాంధ్ర–కదిరి: సమసమాజ స్థాపన కోసం వందేళ్లు కాదు మరో వందేళ్లయినా రాజీలేని సమరశీల పోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్ అన్నారు. సీపీఐ జాతీయ పిలుపులో భాగంగా దేశ, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్అండ్బీ కార్యాలయం నుంచి వేమారెడ్డి కూడలి, అంబేద్కర్ సర్కిల్ మీదుగా రాయచోటి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రాజీలేని పోరాటం, ఉరికంబం ఎక్కినా చెక్కుచెదరని ధైర్యంతో ప్రజల కోసం పోరాడిన చరిత్ర సీపీఐదేనని అన్నారు. స్వాతంత్ర్యోద్యమం నుంచి నేటి వరకు కమ్యూనిస్టులు లాఠీలు, తూటాలు, నిషేధాలు, నిర్బంధాలు, దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రజా హక్కుల కోసం పోరాడారని తెలిపారు.
‘సబ్కా సాథ్–సబ్కా వికాస్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా మళ్లిస్తోందని వేమయ్య యాదవ్ విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, రైతాంగ సంక్షోభం, విద్య, వైద్య రంగాల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నా వాటి పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించడం లేదన్నారు. ప్రజల మధ్య విభజన రాజకీయాలను ప్రోత్సహించడం ఆందోళనకరమన్నారు.యువతకు ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నియామకాలు చేపట్టకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను ప్రోత్సహించడం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్ ధరల భారాన్ని తగ్గించడంలో విఫలమైందని విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వకపోవడంతో రైతులు గిట్టుబాటు ధర కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరించడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, దేశ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్యాంకులు, బీమా, రైల్వేలు, విమానయానం, పోర్టులు, గనులు, విద్యుత్ వంటి వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ పాత్రను తగ్గించడం దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదకరమన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య భారంగా మారుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు తగిన నిధులు, సిబ్బంది, మౌలిక వసతులు కల్పించకుండా ప్రజలను ప్రైవేటు వైద్యంపై ఆధారపడేలా చేయడాన్ని ఖండించారు.మహిళల భద్రత, సాధికారతపై ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితం కాకుండా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యాంగ హక్కులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రాయలసీమ అభివృద్ధి ప్యాకేజీ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి తీసుకురావాలని వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు.దేశ సమైక్యత, ప్రజల జీవన హక్కులు, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వైద్యం, రైతాంగ పరిరక్షణ, కార్మిక హక్కుల సాధన కోసం ఆగస్టు 6 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న ప్రచార పాదయాత్రల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల స్వరాన్ని దేశ రాజధానిలో బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీపీఐ డివిజన్ కార్యదర్శి నళ్ళజోడు పవన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధునాయక్, సీపీఐ టౌన్ కార్యదర్శి ఎస్.కె. లియాకత్ అలీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి అంజన్‌బాబు, సీపీఐ డివిజన్ సహాయ కార్యదర్శులు హాసన్, మనోహర్, రమణ, అదేప్ప, మండల కార్యదర్శులు రెడ్డప్ప, ఈశ్వరయ్య, రమణ, శ్రీరాముల నాయుడు, రాజారెడ్డి, నాయకులు ముబారక్, కొండయ్య, హనుమంత్‌రెడ్డి, రవి, సిద్దయ్య, విఘ్నేష్, సిద్దు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


