అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం……
దుర్వాసన, దోమలు, పాములు, పందులతో నరకం చూస్తున్న ప్రజలు……
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : నార్పల బ్రిడ్జి నుంచి మసీదు వెళ్లే మార్గంలో ఉన్న కూతలేరు వంక ప్రస్తుతం చెత్తకుప్పగా మారి ప్రజారోగ్యానికి పెను ముప్పుగా పరిణమించింది. మున్సిపల్ చెత్త వాహనం సక్రమంగా రాకపోవడం, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ప్రజలు విచ్చలవిడిగా చెత్తను వంకలో పడేస్తున్నారు. ఫలితంగా కూతలేరు వంక మొత్తం చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.పేరుకుపోయిన చెత్త కారణంగా దోమలు, పాములు, పందులు అధిక సంఖ్యలో సంచరిస్తూ సమీప కాలనీవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నెలకొంది. ప్రజలు ప్రతిరోజూ ముక్కు మూసుకుని తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్వచ్ఛతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ దయనీయ పరిస్థితి కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సమస్యపై ఇప్పటికైనా స్పందించి కూతలేరు వంకలో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా మున్సిపల్ చెత్త వాహనాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా పంపించి చెత్త సేకరణ చేపట్టాలని, భవిష్యత్తులో ఎవరూ అక్కడ చెత్త వేయకుండా కూతలేరు వంకకు ఇరువైపులా కంపౌండ్ వాల్ లేదా రక్షణ కంచె ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకుంటారా..? లేక ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


