డి ఎం అండ్ హెచ్ ఓ డా. ఈ .బి . దేవి
విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : పోలియో నిర్మూలనకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నామని ఈనెల 28న జరుగునున్న పోలియో టీకాల కార్యక్రమం విజయవంతానికి కలిసి రావాలని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ. బి దేవి పిలుపు ఇచ్చారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఛాంబర్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 28 నుంచి 30 వ తేదీ వరకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులకు ఐదేళ్ల లోపు పిల్లలకు నూటికి నూరు శాతం మందికి పోలియో చుక్కలు వేసేందుకై వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. 0-5 సంవత్సరాల మధ్య వయసున్న 2,83,430 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేం దుకు 5,247 మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాలను కలుపుకుని మొత్తం 1,623 పోలింగ్ బూత్లలో పోలియో చుక్కలు వేస్తారన్నారు. జన రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలియో చుక్కలు వేసేందుకు 58 ప్రత్యేక బృందాలు, 68 మొబైల్ టీంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం లోనూ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. తొలిరోజు మిగిలిపోయిన చిన్నారులను గుర్తించేందుకు 29, 30వ తేదీల్లో గృహ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సి డి పి ఓ లు మరియు స్వంచంద సంస్థల ను సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పల్స్ పోలియో ఐదేళ్ల లోపు పిల్లలందరినీ పోలియో బూత్లకు తరలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లాలోని వైద్యాధికారులందరికీ గురువారం జూమ్ మీటింగ్ ద్వారా శిక్షణతో పాటు సూచనలు ,సలహాలు అందివ్వనున్నట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీకాలు అధికారి ప్రసన్న భారతి ,ప్రోగ్రాం అధికారి విష్ణుమూర్తి, మలేరియా అధికారి ఓబులు, డెమో అధికారి నాగరాజు ,డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రండి! పోలియో వ్యాధిని తరిమికొడదాం…
- Advertisement -


