Wednesday, July 2, 2025
Homeజాతీయంలలిత్ మోదీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

ఫెమా కేసులో ఈడీ విధించిన జరిమానాపై పిటిషన్
రూ.10.65 కోట్ల ఫైన్‌ను బీసీసీఐ చెల్లించాలని అభ్యర్థన
లలిత్ మోదీ పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు విధించిన జరిమానాను బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. దీంతో ఆ జరిమానా భారం లలిత్ మోదీపైనే పడింది.

అసలేం జరిగింది?
ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై లలిత్ మోదీకి ఈడీ రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. అయితే, ఈ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన గతేడాది డిసెంబర్‌లో మొదట బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాను ఐపీఎల్ పాలకమండలికి ఛైర్మన్‌గా అధికారిక హోదాలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగిందని, బీసీసీఐ నిబంధనల ప్రకారం సంస్థ ప్రతినిధులు ఎదుర్కొనే చట్టపరమైన ఖర్చులను సంస్థే భరించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆయన వాదనలను బాంబే హైకోర్టు అంగీకరించలేదు. పిటిషన్‌లో పసలేదంటూ కొట్టివేయడమే కాకుండా, లలిత్ మోదీకి అదనంగా రూ.లక్ష జరిమానా కూడా విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది. బీసీసీఐ జరిమానా చెల్లించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, చట్ట ప్రకారం ఈ కేసులో తనను తాను రక్షించుకునేందుకు లలిత్ మోదీకి పూర్తి హక్కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఐపీఎల్‌కు సారథ్యం వహించిన సమయంలో కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలతో లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడే తలదాచుకుంటుండగా, ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజా తీర్పుతో ఆయనకు న్యాయపరంగా మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు