- స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ ప్రవేశాల్లో కబడ్డీని చేర్చాలని ప్రధాని మోదీకి లేఖ
- స్వదేశీ క్రీడకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి
- క్రీడ–విద్య మధ్య ప్రతిభావంతులైన కబడ్డీ క్రీడాకారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
- ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరిన కేపీ రావు
- విద్యా, క్రీడా మంత్రిత్వ శాఖలు, ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని వినతి విజయవాడ (స్పోర్ట్స్,కరెస్పాండంట్) :
ఐఐటీల్లో అమలు చేస్తున్న ‘స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ ప్రవేశాల కింద కబడ్డీ క్రీడను కూడా చేర్చాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజయవాడకు చెందిన కబడ్డీ ప్రేమికుడు, ప్రమోటర్ కేపీ రావు లేఖ రాశారు. భారతదేశ స్వదేశీ క్రీడల్లో ఒకటైన కబడ్డీకి అత్యున్నత విద్యా సంస్థల్లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐఐటీల్లో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఉన్నాయని, అయితే కబడ్డీకి ఆ జాబితాలో చోటు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నత విద్య, క్రీడల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కేపీ రావు పేర్కొన్నారు. కబడ్డీకి ప్రత్యేక ప్రవేశ అవకాశాన్ని కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది యువ క్రీడాకారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
..స్వదేశీ క్రీడకు సముచిత గుర్తింపు..
కబడ్డీ భారతదేశంలో పుట్టిన సంప్రదాయ క్రీడ అని, గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది యువత ఈ క్రీడను అభ్యసిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కబడ్డీ శారీరక దృఢత్వంతో పాటు జట్టు స్ఫూర్తి, క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తుందని వివరించారు. ఇవన్నీ ఐఐటీ విద్యార్థుల్లోనూ అవసరమైన లక్షణాలేనని పేర్కొన్నారు. కబడ్డీని ఐఐటీల ‘స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ కేటగిరీలో చేర్చడం ద్వారా స్వదేశీ క్రీడలకు ప్రోత్సాహం లభించడంతో పాటు క్రీడా ప్రతిభను నిలుపుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా దేశంలో క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు కూడా ఈ నిర్ణయం అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.
..ప్రత్యేక ట్రయల్స్‌తో ప్రవేశాలు..
ఇతర క్రీడలకు ఉన్న మాదిరిగానే కబడ్డీకి కూడా స్పష్టమైన అర్హతా ప్రమాణాలు, పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ, ప్రత్యేక ట్రయల్స్ నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఐఐటీల్లో ప్రవేశం కల్పించే విధానాన్ని రూపొందించాలని కేపీ రావు కోరారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు–క్రీడల మంత్రిత్వ శాఖ, ఐఐటీల జాయింట్ అడ్మిషన్ బోర్డుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానమంత్రిని అభ్యర్థించారు. కబడ్డీని ఐఐటీ ప్రవేశాల్లో చేర్చడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు తమ క్రీడకు ఉన్నత విద్యా స్థాయిలోనూ విలువ ఉందనే బలమైన సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. కబడ్డీ రంగంలో తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. 1993లో తొలి అంతర్జాతీయ పురుషుల, మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహణలో భాగస్వామ్యమయ్యానని, 2004లో బీచ్ కబడ్డీకి ప్రమోటర్‌గా, వ్యవస్థాపకుడిగా వ్యవహరించానని కేపీ రావు లేఖలో తెలిపారు. 2011లో భారతదేశంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్‌ను స్థాపించానని పేర్కొన్నారు. ఐఐటీల్లో కబడ్డీకి ప్రవేశం కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


