కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
న్యూదిల్లీ : విద్వేష ప్రసంగాల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోరు ఆదేశించింది. అయితే, అది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్ర విలువను పౌరులు తెలుసుకోవాలని, ఇలాంటి వ్యవహారాల్లో సంయమం పాటించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలీపై ఫిర్యాదు చేసిన వజహత్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘విద్వేష ప్రసంగాలు చేసే వారికి అవి ఎంత అసభ్యకరంగా, అనుచితంగా ఉంటున్నాయో ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి వ్యాఖ్యలను షేర్ చేయకుండా కొన్ని కట్టడి చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి వాటిని షేర్ చేయకుండా సంయమం పాటించాలి. మేం ఇక్కడ సెన్సార్‌షిప్ గురించి మాట్లాడట్లేదు. కానీ, ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విభజన ధోరణిని అడ్డుకోవాల్సిందే’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. కానీ, భావ ప్రకటనా స్వేచ్ఛపై బాధ్యతాయుత ఆంక్షలు సరైనవే. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ విలువలను ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా… విద్వేషపూరిత ప్రసంగాలను నిలువరించే మార్గాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం సరికాదు: సుప్రీం
అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అతడికి అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించింది. కొందరు కళాకారులు, కార్టూనిస్టులు, స్టాండప్ కమెడియన్‌లు భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో కార్టూనిస్టు హేమంత్ మాలవీయపై గతంలో కేసు నమోదైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తదుపరి విచారణ జులై 15కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టులో అతడు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా… జులై 3న పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కార్టూన్ గీయడంలో ఆయన విచక్షణ లేకుండా ప్రవర్తించాడని పేర్కొంటూ… దానిని తోసిపుచ్చింది. దీంతో మాలవీయ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


