నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నేత, డీఎంకే రథసారధి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన తండ్రి ఎం.కె. స్టాలిన్‌తో ఉన్న చిత్రాన్ని ‘ఎక్స్” (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ, ఇటువంటి అరెస్టుల బెదిరింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
నేను ముత్తమిళ్ అరిజ్ఞర్ కళైజ్ఞర్ (కరుణానిధి) మనుమడిని, ఎం.కె. స్టాలిన్ కుమారుడిని. డీఎంకే సైనికుడిని. ఇటువంటి గిల్లీ దండ్య వ్యూహాలకు మేము భయపడం. రైతుల హక్కుల కోసం పోరాడుతూ అరెస్ట్ అవ్వాల్సి వస్తే ఒక్కసారి కాదు, వందసార్లయినా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం (సోఫా మోడల్ ప్రభుత్వం) రైతుల కష్టాలను తీర్చలేక, వారి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే తనపై అవాస్తవ ప్రచారాలు చేస్తూ కేసులు బనాయించిందని విమర్శించారు. నిచెన్నై నుంచి తంజావూరు వరకు నన్ను లాక్కెళ్లి వేధించాలని చూశారు. పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా దీనిని ఒక కామెడీలాగే చూశానని మీడియాకు చెప్పి ధైర్యంగా వెళ్లాను తప్ప ఎక్కడా పారిపోలేదు” అని చెప్పారు. కరూర్ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోతే కనీసం బాధితుల కుటుంబాలను పరామర్శించకుండా, పోలీసులకు భయపడి విదేశాలకు పారిపోయి డ్యాన్సులు చేసిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ అని ఎద్దేవా చేశారు. తన అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపిన డీఎంకే శ్రేణులకు, పొత్తు ధర్మంతో అండగా నిలిచిన మిత్రపక్ష నాయకులకు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు.


