నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు :నెల్లూరు జిల్లాలోని గూడూరు బ్లాక్‌లోని నరుకూరు గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా అభివృద్ధి చేయడానికి గుర్తించారనేది నిజమేనా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన ఈ అంశంపై పలు ప్రశ్నలు వేశారు. డిజిటల్ గ్రామంలో అందించబోయే సేవలు, ప్రాజెక్టు ఎంత సమయానికి పూర్తవుతుంది, జిల్లాలోని ఇతర గ్రామాలను డిజిటల్ గ్రామంగా మార్చడానికి ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 700 గ్రామాలలో. ( ప్రతి జిల్లా నుండి ఒక గ్రామం) పౌరులకు ప్రభుత్వ సేవలతో పాటు విద్య సేవలు, ఆరోగ్య సేవలు, నైపుణ్య అభివృద్ధి సేవలు, సోలార్ లైట్స్, మరియు ఆర్థిక సేవలను అందించడానికి డిజిటల్ విలేజ్ పైలట్ ప్రాజెక్టుప్రారంభించబడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నెల్లూరు జిల్లాలోని గూడూరు బ్లాక్‌లోని నరుకూరు గ్రామంతో సహా 13 గ్రామాలు ఈ పథకం కిందకు చేరాయన్నారు. ఈ ప్రాజెక్ట్ మార్చి 31, 2024 నాటికి విజయవంతంగా పూర్తి చేయబడిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద బేసిక్ కంప్యూటర్ కోర్సు, కంప్యూటర్ కాన్సెప్ట్‌పై కోర్సు , టాలీ- కౌశల్ ప్రమాణ్ పాత్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బేసిక్ కోర్సు, పోటీ పరీక్ష శిక్షణ, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ యొక్క ప్రాథమిక అంశాలు, టెలి-హెల్త్, టెలి-వెటర్నరీ సంప్రదింపులు, ఆర్థిక చేరిక అవగాహన కార్యక్రమం, సోలార్ వీధిలైట్లు, వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి వంటి సేవలు అందుతాయన్నారు.


