జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్..
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం నగరంలోని అనంతపురం కలెక్టరేట్ నుంచి ఉప్పరపల్లిలోని యాక్సియన్ ఫ్రాటర్నా ఎకాలజీ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా ప్రజలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ కొంత దూరం వరకు ఈ సైకిల్ ను తొక్కారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగానే కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ… సమాజంలోని ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కనీసం వారంలో ఒక రోజైనా ఇంధన వాహనాలను పక్కనపెట్టి ఇంధన పొదుపు పర్యావరణ కోసం కృషి చేయాలన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు ఇప్పటికే ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, అలాంటివి తగ్గాలంటే అటవీ సంపద ఎక్కువగా పెరగాల్సి ఉందన్నారు. ముఖ్యంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గి ఆక్సిజన్ పెరగాలని, దీనిపై జిల్లాలో కోటి మొక్కలు నాటాలన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ధర్మల్ పవర్ పక్కన పెట్టి సోలార్ విండ్ పవర్ ను ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి శివారు ప్రాంతం టివి.టవర్ వరకు కాలినడకన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బయలుదేరి వెళ్లారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి విభాగం మరియు సామాజిక అటవీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీ ఏఎఫ్ ఎకాలజీ కేంద్రం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో సామాజిక వన విభాగం జిల్లా అధికారి గురు ప్రభాకర్, జిల్లా పర్యావరణ కాలుష్య నియంత్రణ శాఖ అధికారి శశికళ, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ, వ్యవసాయ శాఖ అధికారి సాలు రెడ్డి, ఆర్డిటి ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ దీప, శివరాం, వివిధ శాఖల అధికారులు, పలువురు రైతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కిమ్స్ హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థులు, జిందాల్ సంస్థ ప్రతినిధులు ఉద్యోగులు, తదితరులు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రకృతి పరిరక్షణ సామాజిక బాధ్యత
- Advertisement -


