నాలుగు లేబర్ కోడ్ లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు
తణుకు : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దుచేసి కార్మికులకు తీవ్ర హాని తలపెడుతూ కార్పోరేట్ లు,బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా అమలు లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల అభివృద్ధి,సంక్షేమానికే నని నమ్మబలకడాన్ని మించిన మోసం మరొకటి లేదని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలులోకి తెచ్చిన 2025 నవంబరు 21వ తేదీ భారత దేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినంగా నిలచి పోతుందన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమ కాలంలో లాలాలజపతిరాయ్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి యోధానుయోధులు కార్మికులను కట్టుబానిసత్వం నుంచి విముక్తులను చేస్తూ బ్రిటీష్ పాలకులతో పోరాడి సాధించిన కార్మిక చట్టాలను నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దుచేసి వాటి స్థానంలో లేబర్ కోడ్ లు తెచ్చి తిరిగి కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టేసిన దినంగా నవంబర్ 21 దేశ చరిత్రలో నిలచిపోతుందన్నారు. అంతటి ఘనత, ఖ్యాతి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు.ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలనన్నిటినీ అదానీ,అంబానీ లాంటి కార్పోరేట్ లకు ధారాదత్తం చేసిన మోడీ మరింత దోచుకునేందుకు వీలుగా అడ్డంంకిగా వున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ లు అమలులోకి తెచ్చారన్నారు. దేశంలో 40 కోట్ల మంది కార్మికులు జీవించే హక్కును హరించి వేస్తున్న మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మోడీ ప్రభుత్వం సాగిస్తున్న కార్మిక,రైతాంగ, ప్రజావ్యతిరేక నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న రైతు,కార్మిక సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాపిత ఆందోళనలకు,నిరసనలకు పూనుకుంటున్నామన్నారు.
సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, ఏఐటీయూసీ నాయకులు దేవ పెద్దిరాజు, దాకే ముసలయ్య, మందుల ముత్తయ్య, కొంబత్తుల రవికుమార్, కరుటూరి ప్రసాద్, శెట్టి పాపారావు, తోట నాగేశ్వరరావు,పితాని దుర్గారావు,గెడ్డం చంద్రశేఖర్, పి. ధనుంజయ,గండ్రాపు శ్రీనివాసరావు, మందుల ఏసుదానం,గూడెల్లి వెంకటేశ్వరరావు,బోడపాటి నారాయణ,గెద్దాడ అన్నపూర్ణ, అర్జి శివపార్వతి, కంకిపాటి రమణ తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు.


