- గ్రాస్‌రూట్ స్థాయిలో వాలీబాల్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం
- క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాలీబాల్ క్రీడను గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఓపెన్ ట్రయల్స్, అండర్-21 ఆటగాళ్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. ట్రయల్స్‌ను రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు మాట్లాడుతూ విజయవాడలో పీవీఎల్ ట్రయల్స్ నిర్వహించడం సంతోషకరమన్నారు. తొలి దశలో జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో, అనంతరం ప్రతి మండలంలో వాలీబాల్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు బ్లాక్ హాక్స్ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న పీవీఎల్ సీజన్ పోటీలను విజయవాడలో నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రధాన యజమాని కేఎస్‌జీ వ్యవస్థాపకుడు అభిషేక్ రెడ్డి కంకనాల మాట్లాడుతూ ప్రతి ఏడాది టాలెంట్ హంట్ నిర్వహించడం, జిల్లా, గ్రామీణ స్థాయి టోర్నమెంట్‌లకు మద్దతు ఇవ్వడం, కోచ్‌లకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో శిక్షణ అందించడం, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ప్రొఫెషనల్ అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి ఆరో నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే వాలీబాల్‌పై ఆసక్తి పెంపొందించేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం, క్రీడా సంఘాలు, ప్రైవేట్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తే తెలుగు రాష్ట్రాలను దేశంలోనే వాలీబాల్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు. ట్రయల్స్‌లో అండర్-21 విభాగంలో 105 మంది, పీవీఎల్ ఓపెన్ విభాగంలో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓపెన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ నెల 17న గోవాలో జరిగే పీవీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు ఎంపిక చేయనున్నారు.
కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, శాప్ బోర్డు సభ్యుడు సంతోష్, ఎ.రమణరావు, దిగ్గజ వాలీబాల్ క్రీడాకారులు, టీడీపీ యువజన నాయకుడు బోడే వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.


